నాడు అమితాబ్‌పైకి చున్నీలు విసిరి అమ్మాయిల సందడి

దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి.

Updated : 14 Apr 2024 06:47 IST

4వేల బ్యాలెట్‌ పేపర్లపై లిప్‌స్టిక్‌ గుర్తులు.. 
1984లో పోటీచేసి గెలిచిన బిగ్‌ బీ

దిల్లీ: దేశంలో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకుంది. పోలింగ్‌ సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే ప్రతి ఎన్నికల్లోనూ జరిగే కొన్ని విచిత్ర సంఘటనలు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. అలాంటి ఘటనే 1984లో జరిగింది. ఆ ఏడాది బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ ఎన్నికల బరిలోకి దిగినప్పుడు పలు ఆసక్తికర ఘటనలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1984లో ప్రయాగ్‌రాజ్‌ నుంచి అమితాబ్‌ ఎన్నికల బరిలోకి దిగారు. రాజీవ్‌ గాంధీకి స్నేహితుడు కావడంవల్ల ఆయన పట్టుదల మేరకు ఎన్నికల్లో అమితాబ్‌ పోటీ చేయాల్సి వచ్చింది.  ఆయనపై భారతీయ లోక్‌దళ్‌ సీనియర్‌ నేత హేమవతి నందన్‌ బహుగుణ పోటీ చేశారు.

  • ఎన్నికల ప్రచారంలో భాగంగా అమితాబ్‌ కొన్ని ప్రాంతాల్లో తిరుగుతున్న సమయంలో ఆయనకు అమ్మాయిలు, మహిళలు డప్పులు కొడుతూ స్వాగతం పలికేవారు. బిగ్‌ బీ ఎక్కడికి వెళ్లినా ‘లవ్‌ యూ అమితాబ్‌ జీ’ అంటూ అమ్మాయిలు గుంపులుగా ఫాలో అయ్యేవారు. అమితాబ్‌పై తమ చున్నీలను విసురుతూ రచ్చరచ్చ చేసేవారు.
  • ప్రయాగ్‌రాజ్‌ వీధుల్లో అమితాబ్‌ ఎక్కడికి వెళ్లినా, ప్రజలు ఆయన వెంట పరుగులు తీసేవారు. క్రమంగా బిగ్‌ బి సభలకు యువతతోపాటు మహిళలు భారీగా తరలివచ్చేవారు. ఈ సమయంలో అమితాబ్‌ బచ్చన్‌ తన సతీమణి జయా బచ్చన్‌తో కలిసి ప్రచారం చేశారు. అయితే చాలాసార్లు ప్రచారం సమయంలో అభిమానుల వింత చేష్టలు చూసి అమితాబ్‌ సిగ్గుపడాల్సి వచ్చింది.
  • ఇక పోలింగ్‌ రోజు ప్రయాగ్‌రాజ్‌ ప్రజలు ఉత్సాహంగా ఓట్లు వేశారు. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగానే బ్యాలెట్‌పై అమితాబ్‌కు వచ్చిన ఓట్లతోపాటు లిప్‌స్టిక్‌ గుర్తులు కనిపించాయి. కౌంటింగ్‌ కొనసాగుతున్న కొద్దీ లిప్‌స్టిక్‌ గుర్తులతో కూడిన బ్యాలెట్ల సంఖ్య వేగంగా పెరగడం ప్రారంభమైంది. అమితాబ్‌కు ఓటుతోపాటు లిప్‌స్టిక్‌ గుర్తులు ఉన్న దాదాపు 4,000 బ్యాలెట్‌ పేపర్లు వచ్చాయి. చివరకు ఈ 4 వేల ఓట్లను ఎన్నికల సంఘం రద్దు చేసింది.
  • ఆ ఎన్నికల్లో అమితాబ్‌కు 2,97,461 ఓట్లు వచ్చాయి. ఆయన ప్రత్యర్థి బహుగుణకు 1,09,666 ఓట్లు వచ్చాయి. అమితాబ్‌ 1,87,795 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఐదేళ్ల పదవీ కాలం పూర్తి చేయకుండానే అమితాబ్‌ రాజకీయాలకు దూరమయ్యారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని