ఈ లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్‌ లాంటివే!

భారత ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో పయనిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త (డెవలప్‌మెంట్‌ ఎకనామిస్ట్‌) జీన్‌ ద్రెజ్‌ పేర్కొన్నారు.

Published : 15 Apr 2024 03:34 IST

భారత ప్రజాస్వామ్యం సంక్షోభంలో పయనిస్తోంది
అధికార భాజపా ప్రతిపక్షాల గొంతు నొక్కుతోంది
ప్రముఖ ఆర్థికవేత్త జీన్‌ ద్రెజ్‌

రాంచీ: భారత ప్రజాస్వామ్యం ప్రస్తుతం సంక్షోభంలో పయనిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త (డెవలప్‌మెంట్‌ ఎకనామిస్ట్‌) జీన్‌ ద్రెజ్‌ పేర్కొన్నారు. ఈ సంక్షోభంలో తాజా నిరంకుశత్వ తీరు మాత్రమే కాకుండా, అధికార భాజపా ప్రతిపక్షాల గొంతును అణచివేయడం కూడా ఉందని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో జరగుతున్న లోక్‌సభ ఎన్నికలు రిగ్గింగ్‌తో సమానమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడారు. 2019 ఎన్నికలను ఫెరారీకి, కొన్ని సైకిళ్లకు మధ్య పోటీ అని అరుంధతీరాయ్‌ వ్యాఖ్యానించిన సంగతిని గుర్తుచేశారు. ‘‘ఆ రూపకం ఇప్పటికీ చెల్లుబాటవుతుంది. ఈ రోజు సుప్రీంకోర్టు పుణ్యమా అని మనం ఫెరారీకి కార్పొరేట్‌ రంగం ఇంధనం సమకూర్చిన సంగతిని తెలుసుకున్నాం. అదే సమయంలో సైకిళ్లుగా పేర్కొంటున్న ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా, రాష్ట్రీయ జనతా దళ్‌, కాంగ్రెస్‌ తదితర పార్టీలను ఓ పద్ధతి ప్రకారం లక్ష్యంగా చేసుకుంటున్నారు’’ అని చెప్పారు. ‘‘ఈ పార్టీల నేతలు ఏళ్ల తరబడి కేంద్ర సంస్థల తనిఖీలు, వేధింపులను ఎదుర్కొంటున్నారు. ఝార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ జైల్లో ఉన్నారు. లాలూ ప్రసాద్‌ అప్పుడప్పుడూ జైలు శిక్ష అనుభవించారు. రాహుల్‌ గాంధీ కొద్దిలో తప్పించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఖాతాలను స్తంభింపజేశారు. భాజపాకు ప్రమాదకరంగా కనబడుతున్న రాజకీయ నాయకులు వేధింపుల ముప్పును ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరిగే ఎన్నికలు రిగ్గింగ్‌తో సమానమే’’ అని ద్రెజ్‌ వెల్లడించారు. ఝార్ఖండ్‌లో భాజపా విజయం ఖాయమా అని ప్రశ్నించగా.. కమలం పార్టీ పట్ల అసంతృప్తిగా ఉండడానికి ఆ రాష్ట్ర ప్రజలకు చాలా కారణాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ‘‘సైకిళ్లు సరిగా లేకపోవచ్చు. కానీ, ఈ సారి ఓ బృందంగా ఉన్నాయి. అదే చాలా పెద్ద మార్పును సాధించగలదు. ఝార్ఖండ్‌లో భాజపా మెజారిటీ స్థానాలు సాధించవచ్చు. అయితే 2019లో మాదిరిగా 14 స్థానాల్లో 11 స్థానాలను మాత్రం కైవసం చేసుకోలేదు’’ అని స్పష్టం చేశారు. బెల్జియంలో జన్మించిన జీన్‌ 2002లో భారత పౌరసత్వం పొందారు. మరోవైపు, ద్రెజ్‌ వ్యాఖ్యలపై అధికార భాజపా మండిపడింది. ప్రజాస్వామ్య విధానంలో తాము ప్రజల మద్దతును సంపాదిస్తున్నామని స్పష్టంచేసింది. తమ పాలనను నిరంకుశమైనదిగా పేర్కొనడం పూర్తిగా పక్షపాతంతో కూడినది, ఏకపక్షమని విమర్శించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని