అనైక్యతతోనే విపక్షాలు బలహీనపడ్డాయి

లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలపై నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అనైక్యత వల్లే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు.

Updated : 15 Apr 2024 06:26 IST

కాంగ్రెస్‌లో అనేక సంస్థాగత సమస్యలున్నాయి
మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణతోనే పేదలకు మరింత సాధికారత
ఎన్నికల వేళ అమర్త్యసేన్‌ వ్యాఖ్యలు

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికల వేళ దేశ రాజకీయాలపై నోబెల్‌ గ్రహీత అమర్త్యసేన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అనైక్యత వల్లే దేశంలోని ప్రతిపక్ష పార్టీలు తమ శక్తిని చాలా వరకు కోల్పోయాయని ఆయన అభిప్రాయపడ్డారు. అతిపెద్ద విపక్ష పార్టీ కాంగ్రెస్‌లో అనేక సంస్థాగత సమస్యలు ఉన్నాయని, ముందుగా వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈమేరకు పేర్కొన్నారు.

‘‘కుల గణన అనేది మంచి అంశమే. అయితే మెరుగైన విద్య, ఆరోగ్య సంరక్షణ, లింగ సమానత్వం ద్వారా పేదలకు మరింత సాధికారత కల్పించవచ్చు. భారత దేశం వంటి ప్రజాస్వామ్య దేశపు పౌరుడిగా నేను గర్విస్తున్నాను. అయితే మన దేశపు ప్రజాస్వామిక స్వభావాన్ని పెంపొందించడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. జేడీయూ, ఆర్‌ఎల్‌డీ పార్టీలు అకస్మాత్తుగా ఎన్‌డీయే కూటమి వైపు మళ్లడంతో ఇండియా కూటమి దేశ రాజకీయాలపై పెద్దగా పట్టును సాధించలేకపోయింది’’ అని అమర్త్యసేన్‌ చెప్పారు.

అప్పుడు ఒకే మతానికి ప్రభుత్వ ప్రాధాన్యం

భాజపా నేతృత్వంలోని ఎన్‌డీయే ప్రభుత్వపు ఆర్థిక విధానాలపై అమర్త్యసేన్‌ విమర్శలు గుప్పించారు. నిరక్షరాస్యత, లింగ అసమానతలు దేశంలోని పేదల పురోగతిని కష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భాజపా తిరిగి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే ప్రతిపక్షాల వాదనపై అమర్త్యసేన్‌ను ప్రశ్నించగా, దీనివల్ల ఒకే మతానికి ప్రభుత్వ ప్రాధాన్యం లభించే దిశగా అడుగులు పడతాయని, దేశంలోని సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనమేమీ ఉండదన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని