సంక్షిప్త వార్తలు(6)

అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్‌సన్‌ బరాకుడా’ ఆపరేషన్‌లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు.

Updated : 17 Apr 2024 05:56 IST

అరేబియా సముద్రంలో 940 కిలోల మాదకద్రవ్యాల పట్టివేత

దిల్లీ: అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్‌సన్‌ బరాకుడా’ ఆపరేషన్‌లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. కంబైన్డ్‌ మారిటైమ్‌ ఫోర్స్‌(సీఎమ్‌ఎఫ్‌)లో సభ్యత్వం పొందిన తర్వాత ఇలాంటి ఆపరేషన్‌ చేపట్టడం భారత్‌కు ఇదే తొలిసారి. సీఎమ్‌ఎఫ్‌లో 42 దేశాలకు చెందిన నౌకాదళాలున్నాయి. గత నవంబరులో భారత నేవీ ఇందులో సభ్యత్వం పొందింది. అతిముఖ్యమైన నౌకాయన మార్గాల్లో అంతర్జాతీయ నిబంధనలను పాటిస్తూ భద్రతను పెంచే దిశగా సీఎమ్‌ఎఫ్‌ పనిచేస్తుంది.


భారతీయ సంస్కృతికి చిహ్నంగా ‘బృందావన్‌ ఇస్కాన్‌ టవర్‌’

వాషింగ్టన్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని బృందావన్‌లో ఇస్కాన్‌ నిర్మిస్తున్న 70 అంతస్తుల ఆకాశహర్మ్య దేవాలయం భారతీయ సంస్కృతికి చిహ్నంగా నిలుస్తుందని బెంగళూరు ఇస్కాన్‌ సీనియర్‌ ఉపాధ్యక్షుడు చంచలపతి దాస పీటీఐ ఇంటర్వ్యూలో వెల్లడించారు. 80 మిలియన్‌ డాలర్ల (రూ.668 కోట్లు) వ్యయంతో నిర్మిస్తున్న ఈ ఆలయం 210 మీటర్ల ఎత్తు ఉంటుందని, దేశ పర్యాటక రంగానికి ప్రధాన ఆకర్షణగా మారుతుందని పేర్కొన్నారు. అష్టభుజి శైలితో రూపుదిద్దుకొంటున్న ఈ ఆకాశహర్మ్యంలో మూడు వైపులా మూడు దేవాలయాలతో పాటు నాలుగో వైపు శ్రీల ప్రభుపాదుల చిహ్నంగా ఓ భవంతి  ఉంటుందని తెలిపారు. పర్యాటకుల కోసం వసతి సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ఏటా 2 కోట్ల మంది సందర్శకులు బృందావన్‌కు వస్తున్నారని, వచ్చే ఆరు నుంచి పదేళ్లలో ఉత్తర్‌ప్రదేశ్‌ పర్యాటకం ఐదు రెట్లు పెరిగి సుమారు 10 కోట్ల మంది విచ్చేస్తారని అన్నారు. ఈ ఆలయంలో అన్ని అధునాతన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని, ఏకకాలంలో 3 వేల కార్లు నిలపగలిగే పార్కింగ్‌ అందుబాటులో ఉంటుందని చెప్పారు. రోజుకు రెండు లక్షల మంది, ఉత్సవాల్లో అంతకంటే ఎక్కువమంది వచ్చినా ఇబ్బంది లేనివిధంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.


మీటర్‌ క్యాబిన్‌లో మంటలు.. ముంబయిలో 14 మందికి గాయాలు

ముంబయి: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో మంగళవారం 8 అంతస్తుల భవనం మీటర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. భవనంలోని వారు తప్పించుకునే క్రమంలో గాయపడ్డారు. సుందర్‌నగర్‌ ప్రాంతంలోని గిర్నార్‌ గెలాక్సీ భవనం ప్రవేశమార్గం మెట్ల కిందనున్న మీటర్‌ క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. పది నిమిషాల్లోపే మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, తప్పించుకునే క్రమంలో అయిదుగురు వృద్ధులు, ఓ చిన్నారి సహా 14 మంది గాయపడ్డారు.


కేంద్ర హోంశాఖ భవనంలో చెలరేగిన మంటలు

దిల్లీ: దేశరాజధాని దిల్లీలో కేంద్ర హోంశాఖ భవనంలో మంగళవారం మంటలు చెలరేగాయి. ఉదయం 9.15 గంటల సమయంలో భవనంలºని నార్త్‌బ్లాక్‌లోని రూమ్‌ నెంబర్‌ 209లో స్వల్పంగా అగ్నిప్రమాదం చోటుచేసుకున్నట్లు హోంశాఖ ప్రతినిధి వెల్లడించారు. షార్ట్‌సర్యూట్‌ కారణంగానే మంటలు చెలరేగినట్లు ఆయన తెలిపారు. ప్రమాదంలº ఎవ్వరికీ ఎలాంటి హాని జరగలేదు. ఎటువంటి పత్రాలూ కాలిపోలేదు. మంటల తీవ్రత తక్కువగా ఉండటం వల్ల కొన్ని వస్తువులు, పరికరాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అగ్నిమాపక సిబ్బంది 20 నిమిషాల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఘటన స్థలంలో లేరు.


జీలం నదిలో పడవ బోల్తా ఆరుగురి దుర్మరణం

శ్రీనగర్‌: జమ్మూ-కశ్మీర్‌లోని జీలం నదిలో ఘోర ప్రమాదం సంభవించింది. పాఠశాల విద్యార్థులతో సహా వెళుతున్న ఓ పడవ మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో శ్రీనగర్‌ శివారులోని గాండబల్‌ నౌగామ్‌ ప్రాంతంలో బోల్తా పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతిచెందారు. మరో ఆరుగురిని రక్షించగా వారిలో ముగ్గురిని ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 15 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఏడుగురు మైనర్లు. పడవలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే విషయమై కచ్చితమైన సమాచారం లేదని అధికారులు తెలిపారు.


‘ఎల్‌ఎంవీ లైసెన్సు’ కేసుపై తదుపరి విచారణ జులై 30న

దిల్లీ: తేలికపాటి మోటారు వాహనం (ఎల్‌ఎంవీ) లైసెన్సు పొందిన వ్యక్తి 7,500 కేజీల బరువు మించని రహదారి వాహనం నడపొచ్చా లేదా అన్న న్యాయపరమైన ప్రశ్నపై విచారణ నిర్వహిస్తున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తదుపరి విచారణను జులై 30కి వాయిదా వేసింది. మోటార్‌ వెహికల్‌ చట్టం-1988కి సవరణ చేసే అంశంపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ చర్చలు జరుపుతోందని, సార్వత్రిక ఎన్నికల ముగిసిన తర్వాత పార్లమెంటు ముందు సవరణ బిల్లును ప్రవేశపెడతామని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి మంగళవారం న్యాయస్థానానికి తెలిపారు. దీంతో ధర్మాసనం వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని