సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్‌లోని కుచ్‌ జిల్లా మాతా నో మద్‌ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Published : 17 Apr 2024 05:05 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్‌లోని కుచ్‌ జిల్లా మాతా నో మద్‌ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను బిహార్‌కు చెందిన విక్కీ గుప్తా(24), సాగర్‌ పాల్‌(21)గా గుర్తించామన్నారు. వారిని మంగళవారం మేజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరు పరచగా.. న్యాయస్థానం నిందితులను 9 రోజుల పోలీసు కస్టడీకి(ఈనెల 25వరకు) అప్పగించింది.

హత్య చేసే ఉద్దేశంతోనే..

సల్మాన్‌ను హత్య చేసే ఉద్దేశంతోనే నిందితులు కాల్పులు జరిపారని పోలీసులు కోర్టుకు తెలిపారు. జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ ముఠా వీరిని కిరాయికి తీసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు పేర్కొన్నారు. ఘటనా సమయంలో నిందితుల్లో ఒకరైన సాగర్‌ కాల్పులు జరపగా, ముఠా సభ్యులతో విక్కీ సంప్రదింపులు జరిపాడని వివరించారు. కాల్పులకు ముందు నిందితులిద్దరూ సల్మాన్‌ ఇంటి చుట్టూ మూడుసార్లు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. సల్మాన్‌ ఇంటి వద్ద కాల్పుల నేపథ్యంలో బంద్రాలోని ఆయన నివాసాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే మంగళవారం సందర్శించారు. సల్మాన్‌, ఆయన తండ్రి సలీమ్‌ ఖాన్‌లతో భేటీ అయ్యారు. సల్మాన్‌, ఆయన కుటుంబ సభ్యులకు భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని