బెయిల్‌ కోసం మిఠాయిలు తింటున్నారు

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ఆరోపించింది.

Published : 19 Apr 2024 05:15 IST

కేజ్రీవాల్‌పై కోర్టులో ఈడీ ఆరోపణ

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ)ఆరోపించింది. టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్నప్పటికీ జైలులో ఆయన చక్కెర ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను ఉద్దేశపూర్వకంగా తీసుకుంటున్నారని పేర్కొంది. ఇందుకోసం ఆయన ఇంటి నుంచి భోజనంతో పాటు అరటి, మామిడి పండ్లు, మిఠాయిలు, పూరీలు ప్రతిరోజూ తెప్పించుకుని తింటున్నారని న్యాయస్థానానికి తెలిపింది. దీంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రిలో చేరదామని, లేదా బెయిల్‌ పొందుదామని కేజ్రీవాల్‌ ప్రయత్నిస్తున్నారని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ముందు విన్నవించింది. దీనిపై స్పందించిన ధర్మాసనం జైల్లో కేజ్రీవాల్‌ తీసుకుంటున్న భోజనంతో పాటు ఆయన డైట్‌ ఛార్ట్‌పై శుక్రవారం లోపు నివేదిక ఇవ్వాలని తిహాడ్‌ జైలు అధికారులను ఆదేశించింది.

ఇన్సులిన్‌ ఇవ్వడం లేదు: ఆతిశీ

ఈడీ ఆరోపణలపై స్పందించిన మంత్రి ఆతిశీ.. ఇంటినుంచి ఆహారాన్ని నిలిపివేసి, ఇన్సులిన్‌ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ను జైల్లోనే చంపడానికి భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఇన్సులిన్‌ కావాలని సీఎం విజ్ఞప్తి చేసినా తిహాడ్‌ జైలు యంత్రాంగం తిరస్కరిస్తోందని చెప్పారు. కేజ్రీవాల్‌ ఆరోగ్యంపై మంత్రి ఆతిశీ చెప్పిన అంశాలు అసత్యమని తిహాడ్‌ జైలు అధికారులు స్పష్టంచేశారు. కేజ్రీవాల్‌ ఫాస్టింగ్‌ షుగర్‌ స్థాయులు అదుపులోనే ఉన్నాయని, ఏనాడూ 300 ఎంజీ/డీఎల్‌ దాటలేదని చెప్పారు. మరోవైపు, జైల్లో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ సైతం ఇవ్వడం లేదన్న మంత్రి ఆతిశీ ఆరోపణలపై దిల్లీ లెప్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనా స్పందించారు. ఈ ఆరోపణలపై 24 గంటల్లోగా నివేదిక అందజేయాలని జైళ్ల శాఖ డీజీని ఆదేశించినట్లు రాజ్‌భవన్‌ గురువారం రాత్రి తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని