ఇన్సులిన్‌ ఇవ్వకుండా కేజ్రీవాల్‌ ఆరోగ్యం క్షీణింపజేస్తున్నారు

తిహాడ్‌ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వకుండా, తన వైద్యుడితో సంప్రదింపులకు అవకాశం కల్పించకుండా కావాలని ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శనివారం ఆరోపించింది.

Published : 21 Apr 2024 05:26 IST

ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపణ

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌ ఇవ్వకుండా, తన వైద్యుడితో సంప్రదింపులకు అవకాశం కల్పించకుండా కావాలని ఆయన ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తున్నారని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) శనివారం ఆరోపించింది. తనకు ఇన్సులిన్‌ ఇవ్వాలని, కుటుంబ వైద్యుణ్ని వీడియో కాన్ఫరెన్సులో సంప్రదించేందుకు అనుమతించాలని టైప్‌-2 మధుమేహంతో బాధపడుతున్న కేజ్రీవాల్‌ పెట్టుకున్న అభ్యర్థనలను జైలు యంత్రాంగం తిరస్కరించిందని పార్టీ అధికార ప్రతినిధి సౌరభ్‌ భరద్వాజ్‌ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత 22 సంవత్సరాలుగా కేజ్రీవాల్‌ మధుమేహంతో బాధపడుతున్నట్లు చెప్పారు.


ఆయన ఇన్సులిన్‌ ఎప్పుడో ఆపేశారు

అరెస్ట్‌ కావడానికి కొన్ని నెలల ముందే అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇన్సులిన్‌ తీసుకోవడం ఆపేశారని శనివారం అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన మధుమేహానికి నోటి ద్వారా తీసుకునే మందులు వాడుతున్నారని తెలిపారు. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వి.కె.సక్సేనాకు తిహాడ్‌ జైలు అధికారులు సమర్పించిన నివేదికను ఉటంకిస్తూ ఈ విషయాలను వెల్లడించారు.ఓ ప్రైవేటు వైద్యుడి పర్యవేక్షణలో ఉన్న కేజ్రీవాల్‌ కొన్ని నెలల క్రితమే ఇన్సులిన్‌ తీసుకోవడం ఆపేశారని, అరెస్టు చేసే సమయంలో ఆయన మధుమేహానికి వాడే ఔషధం మెట్‌ఫార్మిన్‌ మాత్రలు వాడుతున్నారని నివేదికలో అధికారులు తెలిపారు. తాను కొన్నేళ్లుగా ఇన్సులిన్‌ వాడుతున్నానని, అయితే కొన్ని నెలల క్రితం నిలిపివేశానని తిహాడ్‌ జైల్లో వైద్య పరీక్షల సమయంలో కేజ్రీవాల్‌ వైద్యులకు తెలియజేశారని కూడా స్పష్టంచేశారు. ‘‘ఈ నెల 10, 15 తేదీల్లో వైద్య నిపుణుడు కేజ్రీవాల్‌ ఆరోగ్యాన్ని సమీక్షించి మధుమేహం మాత్రలు సరిపోతాయని సూచించారు. అంతేతప్ప ఆయనకు ఇన్సులిన్‌ ఇచ్చేందుకు జైలు యంత్రాంగం నిరాకరించినట్లు చెప్పడం సరికాదు’’ అని జైళ్ల శాఖ డీజీ సమర్పించిన నివేదికలో పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని