మీది ఉక్కు సంకల్పం

భారత్‌కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్‌ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు.

Published : 23 Apr 2024 04:53 IST

సియాచిన్‌లోని భారత సైనికులకు రాజ్‌నాథ్‌ కితాబు

లేహ్‌/దిల్లీ: భారత్‌కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్‌ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎత్తయిన యుద్ధక్షేత్రంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతాన్ని సోమవారం ఆయన సందర్శించారు. అక్కడి భద్రతా స్థితిని సమీక్షించారు. 15,100 అడుగుల ఎత్తులోని ఒక సైనిక శిబిరంలో జవాన్లను ఉద్దేశించి రాజ్‌నాథ్‌ ప్రసంగించారు. ఈ శీతల హిమానీనదంలో మోహరించిన భారత సైనికుల ఉక్కు సంకల్పాన్ని ఆయన కొనియాడారు. వారి ధైర్యసాహసాలు భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. సియాచిన్‌.. భారత సార్వభౌమాధికారం, సంకల్పానికి నిదర్శనమని తెలిపారు. ‘‘భారత్‌కు దిల్లీ పాలనా రాజధాని. ముంబయి ఆర్థిక, బెంగళూరు టెక్నాలజీ రాజధానులు. అలాగే సియాచిన్‌ ధైర్యసాహసాలు, పట్టుదల, సంకల్పానికి రాజధాని’’ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భారత బలగాల మోహరింపునకు ఇటీవలే 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్‌.. సియాచిన్‌ను సందర్శించారు. ‘‘మన ధీర సైనికులు సరిహద్దుల్లో దృఢంగా నిలబడి ఉండటం వల్లే దేశ ప్రజలంతా శాంతియుత జీవనాన్ని గడుపుతున్నారు. ఆహారాన్ని మొదట దేవతలు, పురోహితులు, గురువులకు అర్పిస్తాం. అదేరీతిలో దీపావళి నాడు వెలిగించే తొలి దీపాన్ని, హోలీ రోజు చల్లే తొలి రంగును మన దేశ రక్షకులకు అంకితమివ్వాలి. కాపాడే ఏ దేవుడికీ మన సైనికులు తీసిపోరు’’ అని పేర్కొన్నారు. అంతకుముందు రాజ్‌నాథ్‌.. సియాచిన్‌లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు