అది బెయిల్‌ షరతుల ఉల్లంఘనే

లఖింపుర్‌ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్‌ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్‌ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది.

Published : 23 Apr 2024 04:54 IST

రాజకీయ కార్యక్రమాలకు ఆశిష్‌ మిశ్ర హాజరు అంశంపై సుప్రీం

దిల్లీ: లఖింపుర్‌ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్‌ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్‌ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. ఎనిమిది మంది మరణించిన అక్టోబరు 03, 2021నాటి లఖింపుర్‌ ఖేరి హింసా ఘటన కేసులో గతేడాది జనవరి 25న ఆశిష్‌ మిశ్రకు కొన్ని షరతులతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్ర కుమారుడైన ఆశిష్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లో రాజకీయ కార్యక్రమాలకు హాజరవుతున్నారని ఓ బాధితుడి తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. అంతేకాకుండా ఓ కార్యక్రమంలో మూడు చక్రాల వాహనాలను కొందరికి పంచిపెట్టారని తెలిపారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పి.ఎస్‌.నరసింహాలతో కూడిన ధర్మాసనం ‘ఆయన (ఆశిష్‌) స్వయంగా కార్యక్రమాలకు హాజరవుతుంటే అది కచ్చితంగా ఉల్లంఘనే’ అని వ్యాఖ్యానించింది.

ఎంపీలు, ఎమ్మెల్యేలపై 2000 పైగా క్రిమినల్‌ కేసులు పరిష్కారం

పార్లమెంటు, శాసనసభ సభ్యులపై నమోదైన క్రిమినల్‌ కేసుల విచారణ కోసం ఏర్పాటైన ప్రత్యేక విచారణ కోర్టులు 2000పైగా కేసులను పరిష్కరించాయి. ఈ మేరకు సీనియర్‌ న్యాయవాది విజయ్‌ హన్సారీ ఓ అఫిడవిట్‌ ద్వారా సుప్రీం కోర్టుకు వెల్లడించారు. ప్రజాప్రతినిధులపై క్రిమినల్‌ కేసులకు సంబంధించిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో ఆయన అమికస్‌ క్యూరీగా వ్యవహరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని