2జీ స్పెక్ట్రమ్‌పై 2012 తీర్పును సవరించండి

వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

Published : 23 Apr 2024 04:58 IST

పన్నెండేళ్ల తర్వాత సుప్రీంకోర్టుకు కేంద్రం విజ్ఞప్తి

దిల్లీ: వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా ధర్మాసనం ముందు సోమవారం ఈ విషయాన్ని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి ప్రస్తావించారు. వెంటనే విచారణ జాబితాలో చేర్చాలని అభ్యర్థించారు. కేంద్ర టెలికం మంత్రిగా ఎ.రాజా ఉన్న సమయం(2008)లో వివిధ సంస్థలకు మంజూరైన 2జీ స్పెక్ట్రమ్‌ లైసెన్సులను రద్దు చేస్తూ 2012 ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వివక్షకు తావులేకుండా పారదర్శకంగా వేలం ద్వారా మాత్రమే వాటిని కేటాయించాలని స్పష్టం చేసింది. ఆ తీర్పు వచ్చిన 12 ఏళ్ల తర్వాత దానిలో మార్పులు చేయాలని కేంద్రం కోరడం గమనార్హం. ఈ విజ్ఞప్తిని అనుమతించరాదంటూ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ అభ్యంతరం తెలిపారు. దేశ సహజ వనరులు దుర్వినియోగం కాకుండా ఇచ్చిన ఆ తీర్పును సవరించడం తగదని పేర్కొన్నారు. గతంలోనూ ఆయన 2జీ స్పెక్ట్రమ్‌ కేటాయింపులను సవాల్‌ చేసిన సెంటర్‌ ఫర్‌ పబ్లిక్‌ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌ అనే సంస్థ తరఫున వాదించారు. అయితే, తీర్పు సమీక్ష అభ్యర్థనను ఈమెయిల్‌ ద్వారా పంపిస్తే తాము పరిశీలిస్తామని అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణికి సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ సూచించారు. కేంద్ర మాజీ మంత్రి ఎ.రాజా, మరో 16 మందిని 2జీ స్పెక్ట్రమ్‌ కేసులో నిర్దోషులుగా ప్రత్యేక కోర్టు ప్రకటించడాన్ని సవాల్‌ చేస్తూ సీబీఐ 2018లో వేసిన పిటిషన్‌ను ఈ ఏడాది మార్చిలో దిల్లీ హైకోర్టు అనుమతించింది. 2017 డిసెంబరు 21న ఎ.రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులను ప్రత్యేక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఈ తీర్పులో కొన్ని లోపాలున్నాయని దిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది.

న్యాయవాది నమోదు రుసుము రూ.600లకు మించకూడదు

దేశవ్యాప్తంగా న్యాయ విద్యను పూర్తి చేసుకున్న గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయడానికి రూ.600 కంటే ఎక్కువ రుసుము వసూలు చేయకూడదంటూ సోమవారం సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. ఈ మొత్తాన్ని చట్ట సవరణ ద్వారా పార్లమెంటు మాత్రమే పెంచగలదని పేర్కొంది. దేశంలో న్యాయవాదులుగా నమోదు చేసుకోవడానికి రాష్ట్ర బార్‌ సంస్థలు అధిక రుసుమును వసూలు చేస్తున్నాయంటూ 10కి పైగా నమోదయిన పిటిషన్లపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం విచారించింది. అధిక నమోదు రుసుములు చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని, దీనిపై వెంటనే బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా(బీసీఐ) స్పందించాలని న్యాయస్థానం ఆదేశింది. గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా నమోదు చేయడానికి ఒడిశాలో రూ.42,100, గుజరాత్‌లో రూ.25వేలు, ఉత్తరాఖండ్‌లో రూ.23,650, ఝార్ఖండ్‌లో రూ.21,460, కేరళలో రూ.20,050 వసూలు చేస్తున్నారంటూ పిటిషనర్లు తమ అభ్యర్థనల్లో పేర్కొన్నారు. ‘‘మనం రూ.15,000 రుసుము పై మాత్రమే మాట్లాడుతున్నాం. కానీ, క్యాన్సర్‌ లేదా మూత్రపిండాల వ్యాధితో బాధపడే న్యాయవాదులకు రూ.25,000 చొప్పున చెల్లిస్తున్నాం’’ అని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఛైర్‌పర్సన్‌ మనన్‌కుమార్‌ మిశ్ర న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.


దివ్యాంగ చిన్నారి తల్లికి సెలవు నిరాకరణ

రాజ్యాంగ విధుల ధిక్కరణే

దివ్యాంగ చిన్నారి తల్లికి శిశు సంరక్షణ సెలవులను నిరాకరించడం శ్రామికశక్తిలో మహిళా భాగస్వామ్యానికి సమాన ప్రాతినిధ్యం కల్పించాలన్న రాజ్యాంగ విధి ధిక్కరణేనని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. దివ్యాంగులైన చిన్నారులు గల ఉద్యోగినులకు శిశుసంరక్షణ సెలవులు కల్పించే అంశంపై విధానపరమైన నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి సూచించింది. ‘‘శ్రామిక శక్తిలో మహిళలకు భాగస్వామ్యం ప్రత్యేక హక్కు కాదు..అది రాజ్యాంగపరమైన విధి. ఆదర్శ యజమానిగా రాజ్యం దానిని విస్మరించరాదు’’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి.పార్దీవాలాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో కేంద్రాన్ని భాగస్వామిని చేయాలని, తీర్పు ఇవ్వడంలో అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి సహకారాన్ని తీసుకోవాలని ఆదేశించింది. రాష్ట్ర జియోగ్రఫీ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా వ్యవహరిస్తున్న పిటిషన్‌దారైన మహిళకు జన్యుపరమై లోపంతో గల తన కుమారుడి బాగోగులు చూసుకునేందుకు ఆమెకు శిశు సంరక్షణ సెలవులు మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని పేర్కొంది. ఆ బాలుడికి పుట్టినప్పటి నుంచి పలుమార్లు శస్త్రచికిత్సలు నిర్వహించిన కారణంగా నిబంధనల పరంగా ఆమెకు మంజూరు చేసిన సెలవుల కోటా పూర్తైపోయింది. ఈ నేపథ్యంలో ఆమె కోర్టునాశ్రయించారు.


తాజ్‌మహల్‌ సంరక్షణ ప్రణాళికలపై మీ అభిప్రాయం తెలపండి

- పురావస్తు శాఖకు సుప్రీం ఆదేశం

దిల్లీ: చారిత్రక కట్టడం తాజ్‌మహల్‌, దాని పరిసరాల పరిరక్షణకు సంబంధించిన దార్శనిక పత్రం, ప్రణాళికలను పరిశీలించి అభిప్రాయం తెలపాలని భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ)ను సుప్రీంకోర్టు ఆదేశించింది. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌(ఎస్పీయే) ద్వారా ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం వీటిని రూపొందించింది. దార్శనిక పత్రం, ప్రణాళికలను అధికారికంగా నమోదు చేయాలని యూపీ సర్కారుకు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌.ఓక్‌, జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం సూచించింది. తాజ్‌మహల్‌ పరిరక్షణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం సోమవారం ఈ ఆదేశాలిచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని