కేజ్రీవాల్‌కు ఇన్సులిన్‌పై మెడికల్‌ బోర్డు ఏర్పాటు చేయండి

తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది.

Updated : 23 Apr 2024 06:05 IST

ఎయిమ్స్‌కు దిల్లీ కోర్టు ఆదేశం
వీసీలో వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతి నిరాకరణ

దిల్లీ: తిహాడ్‌ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్‌ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్‌ డైరెక్టర్‌ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. తన వైద్యుడు సూచించిన ఆహార పట్టికకు భిన్నంగా కేజ్రీవాల్‌ ఆహారం తీసుకున్నారని వ్యాఖ్యానించింది. తన భార్య సమక్షంలో తన వైద్యుడితో సంప్రదించేందుకు వీడియో కాన్ఫరెన్స్‌(వీసీ)లో అవకాశం ఇవ్వాలన్న ఆయన వినతిని తోసిపుచ్చింది. ఈ మేరకు సీబీఐ, ఈడీ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఆదేశాలు జారీ చేశారు. జైలులో తనకు ఇన్సులిన్‌ ఇచ్చేందుకు అనుమతించని కారణంగా తన షుగర్‌ స్థాయిలు ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.  అంతకుముందు తిహాడ్‌ జైలు సూపరింటెండెంట్‌కు కేజ్రీవాల్‌ లేఖ రాశారు. అందులో మధుమేహం దృష్ట్యా రోజూ ఇన్సులిన్‌ అడుగుతున్నట్లు స్పష్టం చేశారు. పైగా.. తన డయాబెటిస్‌ పరిస్థితి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎయిమ్స్‌ వైద్యులు ఎప్పుడూ చెప్పలేదన్నారు. ఎయిమ్స్‌ డాక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడినప్పుడు ఇన్సులిన్‌ విషయాన్ని కేజ్రీవాల్‌ లేవనెత్తలేదని, వైద్యులు కూడా సూచించలేదని జైలు అధికారులు ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు స్పందించారు. జైలు అధికారులు చెప్పిందంతా అబద్ధమని, రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తప్పుడు ప్రకటన విడుదల చేశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని