న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి

న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్‌ న్యాయవాది ఆదీశ్‌ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు.

Published : 24 Apr 2024 05:37 IST

ప్రధానికి ఎస్‌సీబీఏ అధ్యక్షుడి లేఖ

దిల్లీ: న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్‌ న్యాయవాది ఆదీశ్‌ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌ (ఎస్‌సీబీఏ) అధ్యక్షుడు కూడా అయిన ఆయన వ్యక్తిగత హోదాలో ఈ లేఖ రాసినట్లు స్పష్టంచేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు రోజురోజుకు పెరుగుతున్న ముప్పునకు అడ్డుకట్ట వేయాలని లేఖలో అభ్యర్థించినట్లు తెలిపారు. సుప్రీంకోర్టు నుంచి జిల్లా కోర్టుల వరకు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసును మూడేళ్ల మేర పెంచాలని, ట్రైబ్యునళ్లు, కమిషన్లలో విశ్రాంత న్యాయమూర్తులకు బదులు సిట్టింగ్‌ న్యాయమూర్తులనే నియమించేలా చట్టాలకు సవరణ చేయాలని కూడా ఆయన ప్రధానిని కోరారు. 2008 నుంచి 2011 మధ్య సుప్రీంకోర్టు నుంచి పదవీ విరమణ చేసిన 21 న్యాయమూర్తుల్లో 18 మంది వివిధ కమిషన్లు, ట్రైబ్యునళ్లలో నియమితులయ్యారని లేఖలో ఆదీశ్‌ సి.అగర్వాలా ప్రస్తావించారు. ‘‘ఈ వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం రూపొందించకపోయినప్పటికీ.. గత ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలను అనుసరించి చర్యలు చేపడుతోంది. కాబట్టి ఆ చట్టాల్లో అర్హతను విశ్రాంత న్యాయమూర్తులు నుంచి సిట్టింగ్‌ జడ్జీలు లేదా ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులుగా మార్పుచేస్తూ సవరణ చేయాల్సిన అవసరముంది’’ అని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని