ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య

ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది.

Updated : 25 Apr 2024 09:35 IST

దిల్లీ: ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. సమాజ సంక్షేమం కోసం సంపద పునఃపంపిణీ జరగాలని స్పష్టంచేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను సమాజ వనరులుగా పరిగణించొచ్చా అన్న అంశంపై జరిగిన విచారణ సందర్భంగా ఈ మేరకు పేర్కొంది.

ముంబయిలోని ప్రాపర్టీ ఓనర్స్‌ అసోసియేషన్‌ (పీవోఏ) సహా పలువురు కక్షిదారుల తరఫు న్యాయవాదులు ధర్మాసనం ఎదుట వాదనలు వినిపించారు. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రస్తావించిన (39 (బి), 31 (సి) అధికరణాలను సాకుగా చూపుతూ ప్రభుత్వ అధికారులు ప్రైవేటు ఆస్తులను స్వాధీనం చేసుకోజాలరని పేర్కొన్నారు. ఈ వాదనతో ధర్మాసనం విభేదించింది. ‘‘ప్రభుత్వ వనరులను మాత్రమే సమాజ వనరులుగా పరిగణించాలనడం సరికాదు. ఇలాంటి అభిప్రాయం ప్రమాదకరం. ఉదాహరణకు.. 39 (బి) అధికరణం కింద ప్రైవేటు అడవులకు ప్రభుత్వ విధానాలు వర్తించవు, అందువల్ల సర్కారు దాని విషయంలో జోక్యంచేసుకోజాలదు అనడం తగదు’’ అని పేర్కొంది. రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఉన్న సామాజిక స్థితిగతులను ఈ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది.

‘‘సమాజంలో పరివర్తన తీసుకురావాలన్నది రాజ్యాంగ ఉద్దేశం. ఒక ఆస్తి ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళ్లాక దానికి 39 (బి) అధికరణం వర్తించదని చెప్పలేం. సమాజానికి సంక్షేమ చర్యలు అవసరం. అందువల్ల సంపద పునఃపంపిణీ జరగాల్సిన అవసరం ఉంది’’ అని తెలిపింది. ఈ సందర్భంగా జమీందారీ వ్యవస్థ రద్దును ప్రధాన న్యాయమూర్తి ప్రస్తావించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను స్వాధీనం చేసుకోవడానికి అధికారులకు వీలు కల్పించే మహారాష్ట్ర చట్టం చెల్లుబాటు అవుతుందా లేదా అన్నది పూర్తిగా భిన్నమైన అంశమని ధర్మాసనం తెలిపింది. దానిపై విడిగా ఉత్తర్వులిస్తామని స్పష్టంచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని