కేజ్రీవాల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

Updated : 18 May 2024 05:33 IST

బెయిల్‌ కోసం విచారణ కోర్టుకు వెళ్లొచ్చని సూచన

దిల్లీ: మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. ఇరువర్గాల వాదనలు విన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. కేజ్రీవాల్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీ, ఈడీ తరఫున సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌.వి.రాజు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. ‘వాదనలు విన్నాం. తీర్పును రిజర్వు చేశాం. అప్పీల్‌దారు చట్టానికి అనుగుణంగా బెయిల్‌ కోసం విచారణ కోర్టుకు వెళ్లొచ్చు’’ అని ధర్మాసనం పేర్కొంది.  దిల్లీ మద్యం విధానం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలపై మార్చి 21న ఈడీ అధికారులు కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 50 రోజుల పాటు దిల్లీలోని తిహాడ్‌ జైలులో ఉన్న దిల్లీ సీఎంకు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఈ నెల 10న సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. తిరిగి జూన్‌ 2న జైలులో లొంగిపోవాలని సూచించింది.      

కేజ్రీవాల్‌పై ఈడీ ఛార్జిషీట్‌.. నిందితుల జాబితాలో ఆప్‌ పేరు

మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ శుక్రవారం మరో అనుబంధ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్, ఆమ్‌ఆద్మీ పార్టీని నిందితులుగా పేర్కొంది. మద్యం కుంభకోణంపై ఈడీ దాఖలు చేసిన ఎనిమిదో ఛార్జిషీట్‌ ఇది. అయితే, ఈ కేసులో కేజ్రీవాల్‌పై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపడం ఇదే తొలిసారి.  మద్యం కుంభకోణం వ్యవహారంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్‌ అని ఈడీ ఆరోపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే పార్టీకి చెందిన కొన్ని ఆస్తులను అటాచ్‌ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు