రాజ్యాంగ ధర్మాసనం తీర్పే గీటురాయి

వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Published : 18 May 2024 05:12 IST

తక్కువ సభ్యులున్న ధర్మాసనాలకు అది శిరోధార్యం
సుప్రీంకోర్టు స్పష్టీకరణ

దిల్లీ: వివిధ వ్యాజ్యాలకు సంబంధించి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనాలు వెలువరించే తీర్పులే అంతిమ నిర్ణయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతకన్నా తక్కువ మంది సభ్యులతో ఏర్పడే ధర్మాసనాలకు రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు గీటురాయిగా నిలుస్తాయని తెలిపింది. హరియాణాలోని ఒక గ్రామ ప్రజల ఉమ్మడి భూమికి సంబంధించి 2022 ఏప్రిల్‌ 7న సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును ఉపసంహరిస్తూ జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం గురువారం ఈ విషయం వెల్లడించింది. 1966లో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన భగత్‌రామ్‌ తీర్పునకు అనుగుణంగా పంజాబ్, హరియాణా హైకోర్టు పూర్తిస్థాయి ధర్మాసనం.... హరియాణా గ్రామీణ ఉమ్మడి భూముల(నియంత్రణ) చట్టం-1961లోని ఉపవిభాగం 6లోని సెక్షన్‌ 2(జి) చట్టబద్దతను పరిశీలించి తీర్పు వెలువరించింది. దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు కాగా ద్విసభ్య ధర్మాసనం... రాజ్యాంగ ధర్మాసనం(భగత్‌రామ్‌) తీర్పునకు భిన్నమైన అభిప్రాయంతో 2022 ఏప్రిల్‌లో ఉత్తర్వు జారీ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ద్విసభ్య ధర్మాసనం పట్టించుకోకపోగా దానికి విరుద్ధమైన నిర్ణయాన్ని వెలువరించడాన్ని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం తప్పుపట్టింది. 2022 ఏప్రిల్‌ 7నాటి ద్విసభ్య ధర్మాసనం తీర్పును ఉపసంహరించడంతో పాటు ఆ తీర్పును సవాల్‌ చేసిన పిటిషన్‌ను విచారణకు అనుమతించింది. తదుపరి విచారణను ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని