సంక్షిప్త వార్తలు (4)

ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్‌ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు.

Published : 19 May 2024 05:40 IST

కేజ్రీవాల్‌ నివాసానికి రాఘవ్‌ చడ్డా

దిల్లీ: ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చడ్డా శనివారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను కలవడానికి ఆయన నివాసానికి వెళ్లారు. కంటి శస్త్ర చికిత్స కోసం లండన్‌ వెళ్లిన చడ్డా పార్టీ ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. దీంతో పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనకపోవడంపై రాజకీయ వర్గాల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. చికిత్స అనంతరం చడ్డా బయట కనిపించడం ఇదే తొలిసారి. ఆప్‌ పేర్కొన్న 40 మంది స్టార్‌ క్యాంపెయినర్‌లలో రాఘవ్‌ చడ్డా ఒకరు. 


ఆదాయపు పన్ను అధికారుల దాడులు.. రూ.40 కోట్ల పట్టివేత

ఆగ్రా: లెక్కల్లో చూపని రూ.40 కోట్లను ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆగ్రా కేంద్రంగా పాదరక్షల వ్యాపారం నిర్వహిస్తున్న ఓ వ్యక్తికి చెందిన వివిధ సముదాయాల్లో శనివారం ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో అక్రమంగా దాచిన రూ.40 కోట్లను గుర్తించినట్లు, ఆ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.


ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం

తిరుచిరాపల్లి: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో తిరుచిరాపల్లి విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. 137 మంది ప్రయాణికులతో శనివారం బెంగళూరు నుంచి తిరువనంతపురం బయలుదేరిన విమానం గాల్లో ఉండగానే పైలెట్‌ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. దీంతో అత్యవసరంగా తిరుచిరాపల్లిలో ల్యాండ్‌ చేసి, అందులోని ప్రయాణికులను దించేశారు. వారిని మరో విమానంలో బెంగళూరుకు పంపించినట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. 


ముగ్గురు బెంగాల్‌ రాజ్‌భవన్‌ అధికారులపై కేసు
గవర్నర్‌పై లైంగిక వేధింపుల వ్యవహారంలో పురోగతి

ఈటీవీ భారత్‌: పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం కొత్తమలుపు తిరిగింది. మేజిస్ట్రేట్‌ ముందు బాధితురాలి వాంగ్మూలం అనంతరం ముగ్గురు రాజ్‌భవన్‌ అధికారులపై శనివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడ పోలీసులకు ఫిర్యాదు చేస్తుందోననే భయంతో ఈనెల 2న బాధితురాలు రాజ్‌భవన్‌ నుంచి బయటకు వెళ్లకుండా ఆ ముగ్గురూ అడ్డుకున్నట్లు చెప్పారు. ఇటీవల గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ తనను వేధింపులకు గురిచేశారంటూ కోల్‌కతా రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న మహిళ స్థానిక ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఉద్యోగం విషయమై గవర్నర్‌ తనను రెండుసార్లు పిలిపించి వేధింపులకు పాల్పడినట్లు ఆమె ఆరోపించింది. కోల్‌కతా పోలీసులపై తనకు నమ్మకం లేదని, ఈ అంశంపై రాష్ట్రపతికి లేఖ రాయనున్నట్లు బాధితురాలు పేర్కొనడం గమనార్హం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని