ఐదో విడతలో జోరెవరిదో!

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్‌ జరగనుంది.

Published : 20 May 2024 06:22 IST

నేడు 49 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
రాయ్‌బరేలీ, అమేఠీలపై అందరి దృష్టి
బెంగాల్‌లో భారీగా బలగాల మోహరింపు

ముంబయి నుంచి ఎన్నికల సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు బయలుదేరిన సిబ్బంది

దిల్లీ: కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ దేశంలో మరో దశ పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. సార్వత్రిక ఎన్నికల ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 నియోజకవర్గాలకు సోమవారం ఓటింగ్‌ జరగనుంది. వీటిలో మొత్తంగా 695 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ జాబితాలో రాజ్‌నాథ్‌ సింగ్, పీయూష్‌ గోయల్, స్మృతి ఇరానీ తదితర కేంద్ర మంత్రులతోపాటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లా వంటి ప్రముఖులు ఉన్నారు. అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్‌లో 7,  బిహార్‌లో 5, ఝార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్‌లో 1, లద్దాఖ్‌లో 1 స్థానానికి పోలింగ్‌ జరుగుతుంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలను ఏడు విడతల్లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో మొత్తంగా 543 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఐదో దశతో కలిపితే 428 సీట్లకు పోలింగ్‌ పూర్తవుతుంది. 

రాయ్‌బరేలీ, అమేఠీలపై అందరి దృష్టి 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రెండూ కాంగ్రెస్‌కు కంచుకోటల్లాంటి సీట్లు. అయితే అయిదేళ్ల కిందట అమేఠీలో రాహుల్‌గాంధీపై స్మృతి ఇరానీ విజయం సాధించి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం రాహుల్‌ రాయ్‌బరేలీలో పోటీ చేస్తున్నారు. అమేఠీలో స్మృతి ఇరానీపై గాంధీ కుటుంబ సన్నిహితుడు కిశోరీలాల్‌ శర్మను కాంగ్రెస్‌ బరిలో దించింది. లఖ్‌నవూలో హ్యాట్రిక్‌పై రాజ్‌నాథ్‌ సింగ్‌ గురిపెట్టారు.  

బారాముల్లాలో 500 మందికిపైగా శతాధిక వయస్కులు 

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి ఈ విడతలో పోలింగ్‌ జరగనుంది. ఇక్కడ 17.37 లక్షల ఓటర్లు ఉన్నారు. అందులో 500 మందికిపైగా శతాధిక వయస్కులు కావడం గమనార్హం. బారాముల్లాలో మొత్తం 22 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారిలో 14 మంది స్వతంత్రులు. ఇక్కడ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఉపాధ్యక్షుడు ఒమర్‌ అబ్దుల్లాకు మాజీ మంత్రి సజ్జాద్‌ లోన్‌ నుంచి గట్టి సవాలు ఎదురవుతోంది. జైల్లో ఉండి పోటీ చేస్తున్న అవామీ ఇత్తెహాద్‌ పార్టీ నేత అబ్దుల్‌ రషీద్‌ షేక్‌ అలియాస్‌ ఇంజినీర్‌ రషీద్‌నూ తక్కువగా అంచనా వేయలేం. 

  పశ్చిమ బెంగాల్‌లో ఏడు సీట్లకు ఈ దశలో పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రతి విడతలోనూ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. దీనికితోడు ఐదో విడతలోని 57% పోలింగ్‌ కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించడంతో.. ముందుజాగ్రత్త చర్యగా  60 వేలకుపైగా కేంద్ర బలగాలతోపాటు 29,172 మంది రాష్ట్ర పోలీసులను మోహరించారు. ఒడిశాలో ఐదు లోక్‌సభ స్థానాలతోపాటు 35 అసెంబ్లీ నియోజకవర్గాలకు సోమవారం పోలింగ్‌ జరగనుంది. 


పట్టణ ఓటర్లకు ఈసీ పిలుపు

ముంబయి, ఠాణె, లఖ్‌నవూ నగరాల ప్రజలు గత ఎన్నికల్లో ఓటింగ్‌ పట్ల ఉదాసీనత కనబరిచారని ఎన్నికల సంఘం (ఈసీ) పేర్కొంది. ఈ దఫా పోలింగ్‌ కేంద్రాలకు పోటెత్తి ఓటుహక్కును వినియోగించుకోవాలంటూ ఆ ప్రాంతాలవారికి పిలుపునిచ్చింది. ఓటు వేసేందుకు ఉత్సాహం చూపరంటూ పట్టణ ఓటర్లపై ఉన్న అపవాదును చెరిపేయాలని కోరింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని