ఆప్‌నకు విదేశీ నిధులు అందాయి

ఆమ్‌ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలకు  విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.

Updated : 21 May 2024 05:55 IST

 హోం మంత్రిత్వ శాఖకు ఈడీ లేఖ

దిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీకి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలకు  విరుద్ధంగా విదేశాల నుంచి రూ.7 కోట్ల నిధులు అందాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోమవారం కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. డ్రగ్స్, మనీ లాండరింగ్‌ కేసులో ఆప్‌ మాజీ ఎమ్మెల్యే సుఖ్‌పాల్‌ సింగ్‌ ఖైరా తదితరులను విచారిస్తున్న క్రమంలో తాజాగా లభించిన కొన్ని పత్రాలు, ఈమెయిల్స్‌ వివరాలను సదరు లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది. ఈడీ అతడిని 2021లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 2015 నుంచి 2016 మధ్యలో ఆప్‌ విదేశీ విభాగం ఆధ్వర్యంలో చేపట్టిన విరాళాల సేకరణలో ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈడీ పేర్కొంది. విరాళం అందించిన వారి వివరాలను పార్టీ రికార్డుల్లో చూపకుండా గోప్యంగా ఉంచినట్లు చెప్పింది. ఆ సమయంలో విరాళాలు అందించిన వారి పేర్లు, చిరునామాతోసహా అన్ని వివరాలనూ ఈడీ అధికారులు లేఖకు జతచేసినట్లు తెలిసింది. సాధారణంగా ఎఫ్‌సీఆర్‌ఏ ఉల్లంఘనలను సీబీఐ విచారిస్తుందనీ, ఆప్‌పై ఈడీ చేసిన తాజా అభియోగాలనూ ఆ దర్యాప్తు సంస్థతోనే విచారణ చేపట్టేలా హోంమంత్రిత్వ శాఖ ఆదేశించాల్సి ఉంటుందని ఓ అధికారి వివరించారు.

అవన్నీ నిరాధార ఆరోపణలు: ఆప్‌  

దిల్లీ, పంజాబ్‌ పరిధిలోని లోక్‌సభ నియోజకవర్గాల్లో వచ్చేవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈడీ చేసిన ఆరోపణలన్నీ భాజపా కుట్రేనని ఆప్‌ కొట్టిపడేసింది. ఆ పార్టీ సీనియర్‌ నేత ఆతిశీ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. మద్యం కుంభకోణం, స్వాతీ మాలీవాల్‌ కేసుల్లో సాధించిందేమీ లేకపోవడంతో.. ఉల్లంఘనలేమీ జరగలేదని నిరూపితమైన విదేశీ విరాళాల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడ్డారు. విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆధారాలతోసహా కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేశామనీ, ఇవన్నీ తమ పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భాజపా ఆడుతున్న నాటకాలేనని ఇదే సమావేశంలో పాల్గొన్న ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని