‘ఓపెన్‌ ఎయిర్‌ జైళ్ల విస్తీర్ణం తగ్గించొద్దు’

వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్‌ ఎయిర్‌ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 21 May 2024 04:27 IST

దిల్లీ: వ్యక్తుల నేర ప్రవృత్తి స్వభావాన్ని సరిదిద్ది, సమాజంలో ఇమిడిపోయేలా చేసేందుకు ఉద్దేశించిన దేశంలోని ఓపెన్‌ ఎయిర్‌ జైళ్ల విస్తీర్ణాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఖైదీలకు జీవనోపాధి కల్పించడంతో పాటు మానసిక ఒత్తిడిని తగ్గించి సాధారణ జీవితం గడపేలా చేయడానికి ఓపెన్‌ ఎయిర్‌ జైళ్లు దోహదపడుతున్నాయని జస్టిస్‌ బి.ఆర్‌.గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం సోమవారం అభిప్రాయపడింది. ఈ జైళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన ఆదర్శ నమూనా నిబంధనలను న్యాయ సహాయకుడు (అమికస్‌ క్యూరీ), న్యాయవాది కె.పరమేశ్వర్‌ అందజేయగా ధర్మాసనం పరిశీలనలోకి తీసుకుంది. జైపుర్‌లోని సంగనేర్‌ ఓపెన్‌ ఎయిర్‌ జైలు విస్తీర్ణాన్ని కుదించే ప్రతిపాదన ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి వచ్చింది. దీంతో దేశంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఓపెన్‌ ఎయిర్‌ జైళ్ల పరిధిలోని స్థలాన్ని తగ్గించే ప్రయత్నాలు చేయొద్దని ఆదేశించింది. సాధారణ జైళ్లన్నీ ఖైదీలతో కిక్కిరిసిపోయి ఉంటున్న పరిస్థితుల్లో...ఓపెన్‌ ఎయిర్‌ జైళ్ల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని అమికస్‌ క్యూరీ ధర్మాసనానికి తెలిపారు. రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, పశ్చిమబెంగాల్‌లో ఓపెన్‌ ఎయిర్‌ కారాగారాల పనితీరు బాగుందని, అక్కడ అనుసరిస్తున్న విధానాలు, నిబంధనలు, అనుభవాలను జాతీయ న్యాయ సేవల సంస్థ (నల్సా)కు అందజేయాలని ఆయా రాష్ట్రాలకు ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను జులై రెండో వారానికి వాయిదా వేసింది.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని