ఉగ్రవాదాన్ని ఎగదోసేవారి జోక్యాన్ని సహించేది లేదు

భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్‌ ఎంపీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటు సమాధానం ఇచ్చారు. ప్రపంచం పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్‌ లాంటి దేశాల జోక్యాన్ని భారత్‌ ఏ మాత్రం సహించబోదని స్పష్టంచేశారు.

Published : 26 May 2024 06:34 IST

పాక్‌ మాజీ మంత్రి వ్యాఖ్యలపై కేజ్రీవాల్‌ మండిపాటు 

దిల్లీ: భారతదేశ సార్వత్రిక ఎన్నికలు, దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చిన పాకిస్థాన్‌ ఎంపీకి దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఘాటు సమాధానం ఇచ్చారు. ప్రపంచం పైకి ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్‌ లాంటి దేశాల జోక్యాన్ని భారత్‌ ఏ మాత్రం సహించబోదని స్పష్టంచేశారు. ‘‘మా వ్యవహారాల్లో తల దూర్చకుండా.. మీ దేశం సంగతి మీరు చూసుకోండి. మీ మద్దతు ఏం అక్కర్లేదు’’ అంటూ బదులిచ్చారు. సార్వత్రిక ఎన్నికల ఆరోవిడతలో భాగంగా అరవింద్‌ కేజ్రీవాల్, తన కుటుంబసభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం సంబంధిత చిత్రాన్ని తన అధికారిక ఎక్స్‌ ఖాతాలో పంచుకున్నారు. ఈ పోస్ట్‌ను పాకిస్థాన్‌ మాజీ మంత్రి, ఎంపీ చౌధరి ఫవాద్‌ హుస్సేన్‌ రీపోస్ట్‌ చేస్తూ.. ద్వేషం, అతివాద భావజాలంపై శాంతి, సామరస్యం విజయం సాధించాలని కామెంట్‌ పెట్టారు. దానికి ఇండియా ఎలక్షన్స్‌ అనే హ్యాష్‌ ట్యాగ్‌ జత చేశారు. దీనిపై అరవింద్‌ కేజ్రీవాల్‌ వెంటనే స్పందించారు.

‘‘చౌధరి సాబ్‌.. మా దేశ సమస్యలను నేను, నా దేశ ప్రజలు పరిష్కరించుకోగలం. ఈ విషయంలో మీ సలహాలేం మాకు అక్కర్లేదు. అసలే మీ దేశం పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ముందు దాని సంగతి చూడండి. ఎన్నికలనేవి మా అంతర్గత వ్యవహారం’’ అని కేజ్రీవాల్‌ పోస్ట్‌ చేశారు. దీనిపై ఫవాద్‌ స్పందించారు. ‘‘ముఖ్యమంత్రి గారు..: ఎన్నికలనేవీ మీ సొంత విషయమే. అయితే ఉగ్రవాదానికి ఎల్లల్లేవని మీరూ అంగీకరిస్తారనుకుంటా. అది పాకిస్థాన్‌ కావొచ్చు.. భారత్‌ కావొచ్చు.. బంగ్లాదేశ్‌ కావొచ్చు.. ఉగ్రవాదం ఎక్కడున్నా ప్రమాదకరమే. అందువల్ల కొంత వివేచన కలిగిన వారు దీనిపై ఆలోచించాలి. పాక్‌లో పరిస్థితి బాగాలేదు. అయితే వ్యక్తులు.. ఎక్కడున్నా.. మెరుగైన సమాజం కోసం కృషి చేయాలి’’ అని తెలిపారు. మరోవైపు ఈ వ్యవహారంలో కేజ్రీవాల్‌పై భాజపా మండిపడింది. ఆయన అవినీతి రాజకీయాలకు పాక్‌ నుంచీ సమర్థన దక్కుతోందన్నారు. దేశ శత్రువులతో కేజ్రీవాల్‌ చేతులు కలిపారని తాము ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నామని దిల్లీ భాజపా అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్‌ తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని