గుజరాత్‌ యంత్రాంగంపై నమ్మకం లేదు

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌ వ్యవహారంలో గుజరాత్‌ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గేమ్‌జోన్‌ నిర్వహణకు దాని యజమానులు అసలు అనుమతులే తీసుకోలేదని తెలియడం, కొన్నేళ్లుగా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై మండిపడింది.

Published : 28 May 2024 04:51 IST

రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌లోని భారీ లోపాలు... అగ్ని ప్రమాదంపై హైకోర్టు ఆగ్రహం
నగర మున్సిపల్, పోలీస్‌ కమిషనర్లు.. మరో 8 మందిపై ప్రభుత్వం వేటు

అహ్మదాబాద్‌: ప్రజల ప్రాణాలతో చెలగాటమాడిన రాజ్‌కోట్‌ గేమ్‌జోన్‌ వ్యవహారంలో గుజరాత్‌ రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గేమ్‌జోన్‌ నిర్వహణకు దాని యజమానులు అసలు అనుమతులే తీసుకోలేదని తెలియడం, కొన్నేళ్లుగా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై మండిపడింది. 18 నెలల క్రితం ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా అగ్ని ప్రమాదాల కట్టడికి తానిచ్చిన ఆదేశాలను అధికారులు అమలుచేయకపోవడంపై నిలదీసింది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై విశ్వాసం కోల్పోయామని జస్టిస్‌ బిరేన్‌ వైష్ణవ్, జస్టిస్‌ దేవన్‌ దేశాయ్‌ ధర్మాసనం సోమవారం పేర్కొంది. నగరంలోని టీఆర్‌పీ గేమ్‌జోన్‌లో శనివారం నాటి అగ్నిప్రమాదంలో 27 మంది మృత్యువాతపడిన ఘటనను హైకోర్టు సుమోటోగా విచారణకు చేపట్టింది. మానవ చర్యల విపత్తుగా దీనిని అభివర్ణించింది. గేమ్‌జోన్‌ పేరుతో చేపట్టిన భారీ నిర్మాణానికి అవసరమైన అనుమతులను నిర్వాహకులు తీసుకోలేదని, అగ్నిమాపక శాఖ నుంచి నిరభ్యంతర పత్రానికీ దరఖాస్తు చేయలేదని కోర్టు సహాయకుడైన న్యాయవాది తెలుపగా...‘నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఇన్నాళ్లూ కళ్లు మూసుకుందా?’ అంటూ ధర్మాసనం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. టీఆర్‌పీ గేమ్‌జోన్‌ ఏర్పాటైన 2021 నుంచి అగ్నిప్రమాదం జరిగిన శనివారం(మే 25) వరకు రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కమిషనర్లుగా పని చేసిన అధికారులు అందరూ ప్రమాదానికి బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. వారందరూ విడివిడిగా అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అగ్నిప్రమాదానికి బాధ్యుడైన వ్యక్తి ఎవరో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుందని, కఠిన చర్యలు తీసుకోనుందని న్యాయవాది ఒకరు తెలుపగా...‘కఠిన చర్యలు తీసుకునేది ఎవరు? వాస్తవం చెప్పాలంటే...రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై మాకు ఇప్పుడు నమ్మకం లేదు. కొన్నేళ్ల క్రితం కూడా ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇది ఆరో ఘటన. ప్రాణాలు పోయినప్పుడు మాత్రమే యంత్రాంగాన్ని కదిలిస్తారు’ అంటూ ధర్మాసనం ఆక్షేపించింది. రెండున్నరేళ్లుగా గేమ్‌జోన్‌లో కార్యకలాపాలు జరుగుతున్నా అగ్నిమాపక శాఖ నుంచి భద్రత ధ్రువీకరణపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? వినోద పన్ను ఎందుకు వసూలు చేయలేదు?...ఇలా అన్ని విభాగాలు ఎందుకు తమ విధులు నిర్వర్తించలేదని ధర్మాసనం నిలదీసింది. బాధ్యులైన అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం గురించి ఆరా తీసింది.

ముగ్గురు ఉన్నతాధికారుల బదిలీ

రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కమిషనర్, ఐఏఎస్‌ అధికారి ఆనంద్‌ పటేల్, నగర పోలీస్‌ కమిషనర్‌ రాజు భార్గవ, అదనపు పోలీస్‌ కమిషనర్‌ విధి చౌధరీ, డిప్యూటీ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌కుమార్‌ దేశాయ్‌లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వారికి ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదని రాష్ట్ర హోంశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు టీఆర్‌పీ గేమ్‌జోన్‌ భాగస్వాములైన ఆరుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్టు చేశారు. సోమవారం రాహుల్‌ రాథోడ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడు యువరాజ్‌ సింహ్‌ సోలంకి, మేనేజర్‌ నితిన్‌ జైన్‌ను ఆదివారం అరెస్టు చేశారు.


ఏడుగురు అధికారుల సస్పెన్షన్‌

టీఆర్‌పీ గేమ్‌జోన్‌ అనుమతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన ఏడుగురు అధికారులను గుజరాత్‌ ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. వీరిలో రాజ్‌కోట్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ఇంజినీర్, అసిస్టెంట్‌ టౌన్‌ ప్లానర్, రహదారులు-భవనాల శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఇద్దరు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లు ఇద్దరుతో పాటు అగ్నిమాపక కేంద్రం అధికారి ఒకరు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని