సంక్షిప్త వార్తలు (10)

పిల్లలకు తరగతి గది అనేది ఓ బందిఖానాలా ఉండకూడదు. రోజూ 8 గంటల పాటు కూర్చోబెట్టి, ఒకరి తర్వాత ఒకరు పాఠాలు బోధిస్తూ, వాటిని గుర్తుంచుకొనేలా వల్లెవేయిస్తూ, వారికి గుర్తుందా లేదా అని తెలుసుకోవడానికి మార్కులను బేరీజు వేయడం వల్ల ఉపయోగం ఉండదు.

Updated : 30 May 2024 06:23 IST

తరగతి గది బందిఖానా కారాదు

పిల్లలకు తరగతి గది అనేది ఓ బందిఖానాలా ఉండకూడదు. రోజూ 8 గంటల పాటు కూర్చోబెట్టి, ఒకరి తర్వాత ఒకరు పాఠాలు బోధిస్తూ, వాటిని గుర్తుంచుకొనేలా వల్లెవేయిస్తూ, వారికి గుర్తుందా లేదా అని తెలుసుకోవడానికి మార్కులను బేరీజు వేయడం వల్ల ఉపయోగం ఉండదు. అది కేవలం వారి జ్ఞాపకశక్తిని పరీక్షించడమే అవుతుంది. పిల్లలను ఉత్తేజితులను చేసేలా, వారిని నేర్చుకొనే ప్రక్రియలో  భాగస్వాములను చేసేలా విద్యావిధానం మారాల్సిన అవసరం ఉంది. పాఠ్యపుస్తకాల్లోని అంశాలను నిజజీవితంలో ఎలా అన్వయించుకోవచ్చన్నది విద్యార్థుల కళ్లకు కట్టే ప్రయోగశాలల్లా తరగతి గదులు ఉండాలి. అప్పుడే వారు ఆటస్థలానికి వచ్చినంత ఉత్సాహంగా పాఠశాలకు వస్తారు.

డాన్‌ గో, పెర్‌ఫార్మెన్స్‌ కోచ్‌


కష్టమైనవి ఎంచుకోండి

డ్రైవింగ్‌కు బదులు నడవండి. కాళ్లు నొప్పి పుట్టినా మీ ఆరోగ్యం మెరుగవుతుంది. ఫోన్‌కు బదులు పుస్తకం తెరవండి. ఆసక్తి ఉన్నా లేకున్నా మీ జ్ఞానం పెరుగుతుంది. భయాలను విడిచిపెట్టి బాధ్యత తీసుకోండి. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. ఇష్టమైనది కాదు.. కష్టంగా అనిపించే పనిని స్వీకరించండి. అప్పుడే మీ ఎదుగుదల సాధ్యమవుతుంది. 

ర్యాన్‌ హాలిడే, రచయిత


మనం తినే ఆహారంలో ఏమున్నాయో ప్రశ్నించుకోవాలి

మనం తీసుకొనే ఆహారంలో ఏమేం కలిసి ఉన్నాయో భారతీయులు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఎంత ఎక్కువ ప్రశ్నించుకుంటే అంత మంచి ఆహారాన్ని ఎంపిక చేసుకోగలం. చాలా ఆహార పదార్థాల్లో చక్కెర శాతం అసాధారణ స్థాయిలో ఉంది. పాలు, మసాలాలు, ప్రొటీన్లు.. ఇలా ప్రతిదాంట్లోనూ కల్తీ జరుగుతోంది. ఫుడ్‌ కలరింగ్‌ కోసం, పండ్లు, కూరగాయలను నిలువ ఉంచడానికి వాడే ప్రిజర్వేటివ్‌ల్లో నాసిరకం రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ప్యాకేజ్డ్‌ ఫుడ్స్‌లోనే కాదు, చాలా రెస్టారెంట్లలోనూ ఇది జరుగుతోంది. ఇవన్నీ మనల్ని నెమ్మదిగా చంపుతున్నాయి. 

నితిన్‌ కామత్, జెరోధా సీఈవో


వీలైనంత త్వరగా పొదుపును ప్రారంభించండి

చాలా మంది 40 ఏళ్లు వచ్చేవరకూ రిటైర్మెంట్‌ జీవితం గురించి ఆలోచించరు. ఉద్యోగ విరమణ తర్వాత సంపాదన ఉండదు. మరోవైపు వృద్ధాప్యం కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలతో ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఎంత తొందరగా రిటైర్మెంట్‌ నిధి కోసం పొదుపు చేయడం ప్రారంభిస్తే, మీ డబ్బు వృద్ధి కావడానికి అంత ఎక్కువ సమయం ఉంటుంది. తక్కువ మొత్తంతోనైనా సరే పొదుపును ప్రారంభించండి.

నేహా నగర్, ఆర్థిక నిపుణురాలు


అగ్నిప్రమాదాల్లో కార్లు, దుకాణాల దగ్ధం

దిల్లీ: తూర్పు దిల్లీ పరిధి మధు విహార్‌లోని ఓ పార్కింగ్‌ ప్రాంతంలో బుధవారం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 16 కార్లు దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి దాటాక ఒంటిగంట ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు రావడంతో నిర్వాహకులు పోలీసులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, తొమ్మిది వాహనాల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మొత్తం వందకుపైగా కార్లు అక్కడ నిలిపి ఉన్నా.. తక్షణమే స్పందించడంతో మిగతా వాహనాలకు మంటలు వ్యాపించకుండా సిబ్బంది నియంత్రించగలిగారు. ఈ దుర్ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మరో ఘటనలో.. ఉత్తర దిల్లీ పరిధి చాందినీ చౌక్‌ ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఐదు దుకాణాలు ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు.. ఎనిమిది వాహనాల సాయంతో మంటలను ఆర్పివేశారు. ఈ వరస ప్రమాదాలపై దిల్లీ భాజపా అధికార ప్రతినిధి స్పందిస్తూ.. స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ప్రమాదం జరిగిన పార్కింగ్‌ లాట్‌లో అగ్నిమాపక నివారణ వ్యవస్థ లేదని చెప్పారు. నష్టపోయిన కార్ల యజమానులకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు.


దిల్లీ అల్లర్ల కేసు నిందితుడు షర్జీల్‌ ఇమామ్‌కు బెయిల్‌
- అయినా జైలులోనే కొనసాగే అవకాశం

దిల్లీ: చట్టవ్యతిరేక కార్యకలాపాలు, దేశ ద్రోహం సహా దిల్లీ అల్లర్ల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షర్జీల్‌ ఇమామ్‌కు నాలుగేళ్ల తర్వాత బుధవారం బెయిల్‌ లభించింది. 2020 దిల్లీ అల్లర్ల కేసులో షర్జీల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. దిల్లీలోని ట్రయల్‌ కోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించగా నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన జస్టిస్‌ సురేశ్‌ కైత్, జస్టిస్‌ మనోజ్‌ జైన్‌ ధర్మాసనం బెయిల్‌ మంజూరుకు సుముఖత తెలిపింది. అయితే, 50 మంది మృతికి కారణమైన అల్లర్లకు సంబంధించిన మరో కుట్ర కేసులో ఉపశమనం ఇంకా లభించనందున జైలు నుంచి షర్జీల్‌ విడుదలయ్యే అవకాశం లేదు. అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయంలో దేశ వ్యతిరేక ప్రసంగాలతో పాటు దిల్లీ అల్లర్లకు కుట్ర సంబంధిత అభియోగాలు షర్జీల్‌పై ఉన్నాయి.


బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించిన కేసులో ఆజంఖాన్‌ను దోషిగా తేల్చిన కోర్టు 

రాంపుర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌): ఎనిమిదేళ్ల కిందట ఓ వ్యక్తిని కొట్టి, బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించారన్న అభియోగాలతో నమోదైన కేసులో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత మహమ్మద్‌ ఆజంఖాన్‌ను రాంపుర్‌లోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు బుధవారం దోషిగా తేల్చింది. ఆయనకు గురువారం శిక్ష ఖరారు కానుంది. మరోవైపు- నకిలీ జనన ధ్రువీకరణ పత్రాల కేసులో ఏడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న ఆజంఖాన్‌ భార్య, మాజీ ఎంపీ తజీన్‌ ఫాతిమా తాజాగా రాంపుర్‌ జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. నిరుడు అక్టోబరు నుంచి ఆమె కారాగారంలో ఉన్న సంగతి గమనార్హం. ఈ కేసులో తజీన్‌తోపాటు ఆజంఖాన్, వారి కుమారుడు అబ్దుల్లా ఆజంఖాన్‌లకు అలహాబాద్‌ హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే వేరే పెండింగ్‌ కేసుల కారణంగా ప్రస్తుతం ఆజంఖాన్‌ సీతాపుర్‌ జైలులో, అబ్దుల్లా హర్దోయీ కారాగారంలో కొనసాగుతున్నారు. 


బెంగాల్, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో సీఏఏ కింద పౌరసత్వ మంజూరు షురూ 

దిల్లీ: పశ్చిమ బెంగాల్, హరియాణా, ఉత్తరాఖండ్‌లలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) కింద పౌరసత్వ మంజూరు ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఈ మూడు రాష్ట్రాల్లో పలువురు దరఖాస్తుదారులకు బుధవారం పౌరసత్వం మంజూరు చేసినట్లు కేంద్ర హోంశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. సీఏఏ కింద దిల్లీలో పలువురికి ఈ నెల 15న తొలిసారి పౌరసత్వం అందజేసిన సంగతి గమనార్హం.


ఈడీ దాడుల్లో రూ.3.5 కోట్ల పట్టివేత

చండీగఢ్‌: అక్రమ మైనింగ్‌ ఆరోపణలతో పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో బుధవారం నిర్వహించిన సోదాల్లో రూ.3.5 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌ పోలీసుల ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా 2014లో డ్రగ్స్‌ మనీ లాండరింగ్‌ కేసులో భోలా అనే వ్యక్తిని ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఈ కేసు ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ లాండరింగ్‌ చట్టం (పీఎంఎల్‌ఏ)  కింద విచారణ దశలో ఉంది. దర్యాప్తులో భాగంగా లభించిన డాక్యుమెంట్ల ఆధారంగా.. తాము గతంలో అటాచ్‌ చేసిన స్థలంలో నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్‌ జరుగుతోందని గుర్తించిన ఈడీ అధికారులు.. రూప్‌నగర్‌ జిల్లాలోని 13 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ.3.5 కోట్లను పట్టుకున్నట్లు దర్యాప్తు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.


ఆప్‌ ఎమ్మెల్యేకు బెయిల్‌ తిరస్కృతి

దిల్లీ: బ్యాంకు మోసానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆప్‌ ఎమ్మెల్యే జస్వంత్‌ సింగ్‌ గజ్జన్‌ మాజ్రాకు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలిచ్చేందుకు నిరాకరించింది. మాజ్రాను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అరెస్టు చేసింది. ప్రతివాదుల వాదన వినకుండా తాము ఊరట ఇవ్వలేమని జస్టిస్‌ సంజయ్‌ కరోల్, జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌ ధర్మాసనం పేర్కొంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని