ఉప్పు ఎక్కువైతే చర్మ ఇన్‌ఫ్లమేషన్‌

శరీరంలో సోడియం ఎక్కువైతే ఎగ్జిమా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. సాధారణంగా ఉప్పు ద్వారా ఇది ఒంట్లోకి చేరుతుంటుంది.

Published : 07 Jun 2024 06:10 IST

దిల్లీ: శరీరంలో సోడియం ఎక్కువైతే ఎగ్జిమా ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం పేర్కొంది. సాధారణంగా ఉప్పు ద్వారా ఇది ఒంట్లోకి చేరుతుంటుంది. ఎగ్జిమా అనేది చర్మానికి సంబంధించిన ఒక ఇన్‌ఫ్లమేటరీ రుగ్మత. దీనివల్ల చర్మంపై పొడి దద్దుర్లు ఏర్పడుతుంటాయి. వీటివల్ల దురద కలుగుతుంది. చర్మంలో సోడియం ఎక్కువైతే ఆటోఇమ్యూన్, దీర్ఘకాల ఇన్‌ఫ్లమేటరీ రుగ్మతలు వస్తాయని మునుపటి పరిశోధనల్లోనూ వెల్లడైంది. సోడియం అధికంగా కలిగిన ఫాస్ట్‌ఫుడ్స్‌ను ఎక్కువగా తీసుకునేవారికి ఎగ్జిమా ముప్పు పెరుగుతుందని తేలింది. అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక రోజుకు నిర్దేశించిన పరిమాణం కన్నా ఒక గ్రాము అదనంగా సోడియాన్ని తీసుకున్నా.. ఎగ్జిమా విజృంభణకు 22 శాతం అవకాశం పెరుగుతుందని గుర్తించారు. ఒక టీ స్పూను ఉప్పులో దాదాపు ఒక గ్రాము సోడియం ఉంటుంది. ఒక రోజుకు రెండు గ్రాముల కన్నా తక్కువగా సోడియాన్ని తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పేర్కొంది. ఎగ్జిమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ముఖ్యంగా.. పారిశ్రామిక దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందన్నారు. దీన్నిబట్టి పర్యావరణ, జీవనశైలి అంశాలు దీనికి కారణమవుతున్నట్లు అర్థమవుతోందని తెలిపారు. ఆహారంలో సోడియం పరిమాణాన్ని పరిమితం చేసుకుంటే.. ఎగ్జిమా ముప్పును తగ్గించుకోవచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని