పరువునష్టం దావా కేసులో విచారణకు రాహుల్‌గాంధీ హాజరు

భారతీయ జనతాపార్టీ కర్ణాటక శాఖ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన.. సంబంధిత కోర్టులో విచారణకు హాజరుకాగా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

Published : 08 Jun 2024 06:28 IST

బెయిల్‌ ఇచ్చిన బెంగళూరు కోర్టు

బెంగళూరులో కోర్టుకు హాజరవుతున్న రాహుల్‌గాంధీ, తదితరులు

ఈనాడు, బెంగళూరు: భారతీయ జనతాపార్టీ కర్ణాటక శాఖ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం ఆయన.. సంబంధిత కోర్టులో విచారణకు హాజరుకాగా న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసులో ఈ నెల 1న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బెయిల్‌ పొందారు. అప్పటి భాజపా సర్కారు అవినీతికి పాల్పడుతోందని, ముఖ్యమంత్రి పదవితో పాటు వివిధ పోస్టులకు ప్రత్యేక ధరలు, అభివృద్ధి పనులు, టెండర్ల కాంట్రాక్టు, మఠాల నిధుల్లో కమీషన్లు వసూలు చేస్తోందంటూ విధానసభ ఎన్నికలప్పుడు అన్ని ప్రధాన పత్రికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటన ఇచ్చింది. గత నాలుగేళ్ల భాజపా సర్కారు కేవలం కమీషన్ల రూపంలో రూ.1.5 లక్షల కోట్లను కొల్లగొట్టినట్లు ధరల పట్టీలో వివరించింది. ఈ ప్రకటనపై భాజపా నాయకుడు బి.ఎస్‌.కేశవమూర్తి అభ్యంతరం వ్యక్తం చేసి, కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ ప్రైవేటు కేసులో రాహుల్‌గాంధీతో పాటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌లకు ప్రజాప్రతినిధుల కోర్టు నోటీసులు జారీ చేసింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా ఈ నెల 1న కోర్టుకు హాజరుకాని రాహుల్‌గాంధీ.. శుక్రవారం హాజరయ్యారు. మాజీ ఎంపీ డీకే సురేశ్‌ కోర్టుకు ఇచ్చిన రూ.75 లక్షల పూచీకత్తు ఆధారంగా ఆయనకు బెయిల్‌ మంజూరైంది. అనంతరం కేసు విచారణను జులై 30కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని