దేశంలో వడగాలి తీవ్రత 1.5 డిగ్రీలు అధికం

ఈ ఏడాది మే నెల్లో దేశంలో వీచిన వేడి గాలులు గతంలో నమోదైన వాటి కంటే దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయని పలువురు స్వతంత్ర శాస్త్రవేత్తలు, పరిశోధకుల బృందం తాజా అధ్యయనంలో పేర్కొంది.

Published : 08 Jun 2024 06:06 IST

 దోహదం చేస్తున్న శిలాజ ఇంధనాల వినియోగం
ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ ఫరాండా వెల్లడి

దిల్లీ: ఈ ఏడాది మే నెల్లో దేశంలో వీచిన వేడి గాలులు గతంలో నమోదైన వాటి కంటే దాదాపు 1.5 డిగ్రీల సెల్సియస్‌ అధికంగా ఉన్నాయని పలువురు స్వతంత్ర శాస్త్రవేత్తలు, పరిశోధకుల బృందం తాజా అధ్యయనంలో పేర్కొంది. ఎల్‌నినో ప్రభావం.., మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్‌ మహాసముద్రంలో ఉపరితలం అసాధారణంగా వేడెక్కడం, వేగంగా పెరుగుతున్న భూతాపం ఫలితంగా ఈ తీవ్రమైన, సుదీర్ఘమైన వడగాలికి కారణమని క్లైమామీటర్‌ సంస్థలోని విశ్లేషకులు తెలిపారు. 1979-2001, 2001-2023 మధ్య మే నెలల్లో వడగాలులను వీరు విశ్లేషించారు. శిలాజ ఇంధనాల వినియోగంతో దేశంలో వేడి గాలులు భరించలేని ఉష్ణోగ్రత పరిమితులకు చేరుకుంటున్నాయని ఫ్రెంచ్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్త డేవిడ్‌ ఫరాండా అన్నారు. 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు సాంకేతిక పరిష్కారాలు లేవన్నారు. కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలను తగ్గించడంతోపాటు భారీ ఉపఉష్ణమండల ప్రాంతాల్లో ముఖ్యమైన ఉష్ణోగ్రత పరిమితులను అధిగమించడానికి అందరూ కృషి చేయాలని ఆకాంక్షించారు. 

ప్రతి నెల గరిష్ఠ ఉష్ణోగ్రతల రికార్డు

యూరోపియన్‌ క్లైమేట్‌ ఏజెన్సీ కోపర్నికస్‌ ప్రకారం.. ‘2023-24 ఎల్‌నినో, వాతావరణ మార్పుల మిశ్రమ ప్రభావంతో ప్రపంచం వాతావరణ తీవ్రతలను చూస్తోంది. ఈ మే అత్యంత వేడిగా గడిచింది. అలాగే జూన్‌ 2023 నుంచి మే 2024 వరకు ప్రతి నెల్లో గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టింది’ అని తెలిపింది. ‘వాయవ్య, మధ్య భారత్‌లోని కొన్ని ప్రాంతాలు మేలో భయంకరమైన వడగాలిని ఎదుర్కొన్నాయి. ఇది దేశ విపత్తు సంసిద్ధతను పరీక్షించింది. అనేక రాష్ట్రాల్లో వడదెబ్బ మరణాలు సంభవించాయి. మార్చి నుంచి మే వరకు దాదాపు 25 వేల అనుమానిత వడదెబ్బ కేసులు, 56 మరణాలు నమోదయ్యాయి’ అని ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. ఏప్రిల్‌ 19 నుంచి జూన్‌ 1 మధ్య జరిగిన ఏడు దశల సార్వత్రిక ఎన్నికల్లో తక్కువ ఓటింగ్‌ నమోదుకు ఆ సమయంలో నమోదైన తీవ్ర ఎండలు ప్రభావం చూపాయనే వాదన ఉంది. కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) ప్రకారం.. దేశంలోని 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఈ వారంలో 22 శాతం మేర పడిపోయాయి. ఇది అనేక రాష్ట్రాల్లో నీటి కొరతను తీవ్రం చేయడంతోపాటు జలవిద్యుదుత్పత్తిని ప్రభావితం చేసింది. తీవ్రమైన వేడి కారణంగా ఇప్పటికే దేశంలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు స్థాయిలో 246 గిగావాట్లకు చేరుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని