రెండు నెలల్లో ఆ కార్యాలయం ఖాళీ చేయండి

జాతీయ రాజధాని దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని రెండు నెలల్లో ఖాళీ చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Published : 11 Jun 2024 05:20 IST

ఆమ్‌ ఆద్మీ పార్టీకి సుప్రీంకోర్టు ఆదేశం

దిల్లీ: జాతీయ రాజధాని దిల్లీలోని రౌజ్‌ అవెన్యూ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని రెండు నెలల్లో ఖాళీ చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆగస్టు 10వ తేదీ కల్లా ఆ బంగ్లాను అప్పగించాలని జస్టిస్‌ విక్రమ్‌ నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతాలతో కూడిన సెలవు కాల ధర్మాసనం సోమవారం స్పష్టం చేసింది. ఇదే స్థలాన్ని దిల్లీ హైకోర్టు విస్తరణకు కేటాయించడంతో వివాదం తలెత్తింది. ఈ అంశంపై మార్చిన 4న విచారణ జరిపిన సుప్రీంకోర్టు జూన్‌ 15కల్లా బంగ్లాలోని ఆప్‌ కార్యాలయాన్ని ఖాళీ చేయాలంటూ గడువు విధించింది. అయితే, ఆప్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వి అభ్యర్థన మేరకు ఆ గడువును సోమవారం మరో రెండు నెలల పాటు పొడిగించింది. ఈ స్థలంపై ఆప్‌నకు ఎలాంటి చట్టబద్ధమైన హక్కు లేదని, ఇదే చివరి అవకాశమని ధర్మాసనం విస్పష్టం చేసింది. తొలుత ఈ స్థలాన్ని జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఆప్‌నకు కేటాయించినప్పటికీ 2017 జూన్‌ 13న ఆ ఉత్తర్వులను దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆదేశాల మేరకు ప్రజాపనుల శాఖ వెనక్కి తీసుకుందని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా తెలిపారు. అయితే, ఈ ఉత్తర్వును దిల్లీ హైకోర్టు గతంలోనే కొట్టివేసిందని, రాజకీయ కారణాలతోనే ఆ కేటాయింపును రద్దు చేశారని  ఆప్‌ వాదిస్తోంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని