సంక్షిప్త వార్తలు (6)

ఈ పోటీ ప్రపంచంలో కొత్త భాషలను నేర్చుకోవడం చాలా అవసరం. అయితే ఏదైనా కొత్త భాషను నేర్చుకొనేవారు దాన్నొక సబ్జెక్టులా కాకుండా దైనందిన   జీవితంలో అంతర్భాగంలా చూడాలి.

Updated : 11 Jun 2024 05:42 IST

భాష నేర్చుకోవడం ఓ ఆటలా ఉండాలి 
- డేవిడ్‌ లవ్‌జాయ్, జీవన నైపుణ్య శిక్షకుడు 

పోటీ ప్రపంచంలో కొత్త భాషలను నేర్చుకోవడం చాలా అవసరం. అయితే ఏదైనా కొత్త భాషను నేర్చుకొనేవారు దాన్నొక సబ్జెక్టులా కాకుండా దైనందిన   జీవితంలో అంతర్భాగంలా చూడాలి. ఈ వారంలోపు ఇన్ని పదాలు నేర్చుకోవాలి, వ్యాకరణం పరీక్షలో పాస్‌ కావాలి అనే ఆలోచనా ధోరణి సరికాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ సందర్భాల్లో   కొత్త భాషలో సంభాషించడం ద్వారా  దాన్ని ఆకళింపు చేసుకొనే ప్రయత్నం చేయాలి. అప్పుడే మన భాషలో జీవం ఉంటుంది. మాతృభాష మాట్లాడటం  కూడా తప్పులతోనే మొదలవుతుంది కనుక అందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. స్కూల్లో నేర్చుకున్న సబ్జెక్టులను నిజ జీవితంలో ఉపయోగిస్తామో లేదో కానీ,  భాష మాత్రం మనకు తప్పకుండా ఉపయోగపడుతుంది. భాష నేర్చుకోవడం   ఓ తపస్సులా కాదు,  ఓ ఆటలా ఉండాలి. 


పనిలోనే ఆనందం దొరికితే జీవితం ధన్యం 

- మనోజ్‌ అరోడా, రచయిత 

సక్తి, అభిరుచి ఉన్న పని చేస్తున్నవారికి అది అసలు పనిలా అనిపించదు. ఇతరులు సెలవుల్లో, విహార యాత్రల్లో ఆనందం వెతుక్కుంటే, వారికి మాత్రం  పనిలోనే ఆనందం దొరుకుతుంది. ఆర్థికంగా స్థిరపడి ఓ దశకు వచ్చాక, వారికి ఇక పని చేయాల్సిన అవసరం ఉండదు. ఎంచక్కా విశ్రాంతి తీసుకోవచ్చు. అయినా వారు పనిని వదులుకోవడానికి ఇష్టపడరు. పనిలోనే విశ్రాంతి పొందుతారు. అప్పుడు రోజుకు 8 గంటలు పనిచేస్తున్నామా, 16 గంటలు కష్టపడుతున్నామా అన్నది లెక్కలోకి రాదు. చాలా మంది కళాకారులకు వేదికపై ప్రదర్శన చేస్తూనే తుదిశ్వాస   విడవాలన్న కోరిక ఉంటుంది. అలా పని చేస్తూ ఒరిగిపోయేవారంతా ధన్యజీవులు.


పొగాకు సంస్థల విచ్చలవిడి ప్రచారం 

- ప్రపంచ ఆరోగ్య సంస్థ  

పొగాకు ఉత్పత్తుల సంస్థలు యువతకు వాటిని అలవాటు చేయడానికి సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నాయి. ఫాలోవర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇన్‌ఫ్లూయెన్సర్లకు డబ్బులిచ్చి ప్రచారం చేయిస్తున్నాయి. 2007-2016 మధ్య 100కు పైగా పొగాకు ప్రచార సంబంధిత హ్యాష్‌ట్యాగ్‌లను సామాజిక మాధ్యమాల వినియోగదారులు సుమారు 2500 కోట్ల సార్లు వీక్షించారు. ప్రభుత్వాలు ఈ పరిస్థితిపై వెంటనే దృష్టిపెట్టి పొగాకు సంస్థల ప్రచారానికి అడ్డుకట్ట వేయాలి.


ఇంజినీర్‌ రషీద్‌ బెయిల్‌ పిటిషన్‌పై జూన్‌ 18న విచారణ

దిల్లీ: ఉగ్రవాదులకు నిధుల పంపిణీ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఇంజినీర్‌ రషీద్‌.. లోక్‌సభ ఎన్నికల్లో బారాముల్లా నుంచి పోటీ చేసి మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లాపై గెలుపొందిన విషయం తెలిసిందే. ఎంపీగా ప్రమాణం చేయడానికి తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఈ నెల 18న విచారణ జరపనున్నట్లు దిల్లీ కోర్టు వెల్లడించింది. 2016 నాటి కేసులో జాతీయ దర్యాప్తు దళం (ఎన్‌ఐఏ) ఉపా చట్టం కింద 2019లో రషీద్‌ను అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైలులో ఉన్నారు. 


బ్రిక్స్‌లో నూతన దేశాల చేరికను స్వాగతించిన భారత్‌ 

మాస్కో: బ్రిక్స్‌ కూటమిలో పూర్తిస్థాయి సభ్యదేశాలుగా ఈజిప్టు, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల చేరికను స్వాగతిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ ‘ఎక్స్‌’లో ఈ మేరకు పోస్టు పెట్టారు. రష్యాలోని నిజ్నీ నొవ్‌గొరొడ్‌ వేదికగా సోమవారం బ్రిక్స్‌ విదేశాంగ మంత్రుల భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఈజిప్టు, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా, ఇథియోపియాల ప్రతినిధులు తొలిసారిగా హాజరయ్యారు. భారత బృందానికి సీనియర్‌ దౌత్యవేత్త దమ్ము రవి ప్రాతినిధ్యం వహించారు. 


భారత్‌కు తిరిగి రానున్న పురాతన విగ్రహం

లండన్‌: దాదాపు 500 ఏళ్లక్రితం నాటి ఓ సాధువు పురాతన కాంస్య విగ్రహాన్ని తిరిగి భారత్‌కు అప్పగించేందుకు యూకేలోని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం దాదాపు అంగీకరించింది. తమిళనాడులోని ఓ ఆలయం నుంచి చోరీకి గురైనట్లు భావిస్తున్న సదరు విగ్రహాన్ని.. 1967లో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం పరిధిలోని మ్యూజియం ఒక వేలంలో కొనుగోలు చేసింది. అయితే, 16వ శతాబ్దానికి చెందిన ఆ విగ్రహం సెయింట్‌ తిరుమన్‌కై అల్వార్‌దనీ.. దాన్ని తిరిగి తమకు అప్పగించాలని యూకేలోని భారత హైకమిషన్‌ ప్రతినిధులు ఇటీవల కోరడంతో.. సదరు మ్యూజియం నిర్వాహకులు సానుకూలంగా స్పందించారు. అక్కడి ఛారిటీ కమిషన్‌ అనుమతి కూడా వస్తే త్వరలోనే ఆ 60 సెంటీమీటర్ల ఎత్తయిన విగ్రహం భారత్‌కు చేరనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని