ఓ మహిళతో న్యాయాధికారి శృంగారచేష్టలు.. వీడియో వ్యాప్తి నిరోధానికి హైకోర్టు ఆదేశం

సామాజిక మాధ్యమాల్లో నవంబరు 29 నుంచి చక్కర్లు కొడుతున్న ఓ ‘శృంగార’ వీడియో వ్యాప్తిని తక్షణం ఆపాలని దిల్లీ హైకోర్టు ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది.

Published : 02 Dec 2022 08:34 IST

దిల్లీ: సామాజిక మాధ్యమాల్లో నవంబరు 29 నుంచి చక్కర్లు కొడుతున్న ఓ ‘శృంగార’ వీడియో వ్యాప్తిని తక్షణం ఆపాలని దిల్లీ హైకోర్టు ఆయా విభాగాలకు ఆదేశాలు జారీ చేసింది. ఓ మహిళతో న్యాయాధికారి ఒకరు లైంగిక చర్యల్లో పాల్గొన్నట్లు ఉన్న ఆ వీడియో షేరింగు కొనసాగితే ఫిర్యాది గోప్యతా హక్కులకు భంగం వాటిల్లుతుందని కోర్టు పేర్కొంది. బుధవారం రాత్రి ఈ కేసును విచారించిన జస్టిస్‌ యశ్వంత్‌వర్మ.. బాధితపక్షం గుర్తింపును దాచాలన్న అభ్యర్థనను ఆమోదిస్తూ మధ్యంతర ఏకపక్ష ఇంజెక్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయపరిపాలన విభాగంలో జరిగిన ఈ ఘటనను మొత్తం హైకోర్టు గుర్తించినట్లు తెలిపారు. ఆ వీడియో నిరోధానికి సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు సమాచారం చేరవేయాలని రిజిస్ట్రార్‌ జనరల్‌ను కోర్టు పురమాయించింది. ఈ దిశగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం కోరింది. 2022 మార్చి 9న చిత్రీకరించిన ఆ వీడియోలో ఉన్న ఓ వ్యక్తి దాఖలు చేసిన దావాను అత్యవసర పరిశీలనకు స్వీకరించి కోర్టు పై ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, సామాజిక మాధ్యమాలకు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణ 9వ తేదీకి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని