ఐఏఎస్‌ అధికారి రోహిణి సింధూరి భర్తపై ఫిర్యాదు

కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి రోహిణి సింధూరి భర్త సుధీర్‌రెడ్డి, అతని అనుచరుడు మధురెడ్డి తమ ట్రస్టు భూమిని కబ్జా చేశారని ప్రముఖ గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు.

Published : 06 Dec 2022 05:05 IST

భూకబ్జా ఆరోపణలతో గాయకుడు లక్కీ అలీ ట్వీట్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే: కర్ణాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారిణి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దాసరి రోహిణి సింధూరి భర్త సుధీర్‌రెడ్డి, అతని అనుచరుడు మధురెడ్డి తమ ట్రస్టు భూమిని కబ్జా చేశారని ప్రముఖ గాయకుడు లక్కీ అలీ ఆరోపించారు. బెంగళూరు నగర శివారు యలహంక సమీపంలోని కెంచేనహళ్లిలో ట్రస్టు భూముల కబ్జా వెనుక ఐఏఎస్‌ అధికారి ఉన్నారంటూ పోలీసు డీజీ ప్రవీణ్‌సూద్‌కు దుబాయి నుంచి అలీ ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. గతంలో ఇచ్చిన ఫిర్యాదులను పోలీసులు స్వీకరించకపోవడంతో ట్విటర్‌ ద్వారా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై, హోంమంత్రి అరగ జ్ఞానేంద్ర ఈ ట్వీట్‌పై స్పందించారు. పోలీసులు ఫిర్యాదు ఎందుకు తీసుకోలేదంటూ డీజీపీ ప్రవీణ్‌సూద్‌ను పిలిపించి అడిగారు. బాలీవుడ్‌లో ప్రముఖ హాస్యనటుల్లో దివంగత మహమూద్‌ అలీ ఒకరు. అతని కుమారుడే లక్కీ అలీ. హిందీ, తెలుగు, కన్నడ తదితర భాషల్లో ఆయన తన పాటలతో అభిమానులను సంపాదించుకున్నారు.

రోహిణిపై వరుస వివాదాలు

ముక్కుసూటిగా వ్యవహరించే అధికారిగా పేరున్న రోహిణి సింధూరిని అదేరీతిలో వివాదాలూ వెంటాడుతున్నాయి. హాసన జిల్లా అధికారిగా ఉన్నప్పుడు రోడ్డు నిర్మాణాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆమె గుత్తేదారులను అడ్డుకున్నారు. అక్కడి చట్టసభ ప్రతినిధి ఒకరు ఆమెపైనే తిరిగి ఆరోపణలు చేశారు. మైసూరుకు బదిలీ అయ్యాక అప్పటి మంత్రి సా.రా.మహేశ్‌ ఆమెపై అవినీతి ఆరోపణలు చేశారు. తనకు కేటాయించిన గెస్ట్‌హౌస్‌ నుంచి కొన్ని వస్తువులు తీసుకెళ్లారని ఆరోపించారు. క్వార్టర్‌లోనూ రూ.కోట్లు వెచ్చించి మరమ్మతులు చేయించుకున్నారన్న ఆరోపణలపై సింధూరి- సా.రా.మహేశ్‌ల మధ్య ఇప్పటికీ కోర్టులో కేసు నడుస్తోంది. తాజాగా ఆమె భర్తపై లక్కీ అలీ ఆరోపణలు తెరపైకి వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని