ఇక ఈశాన్యానా చుక్‌చుక్‌ పరుగులు!

అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం.. ఈశాన్య భారత్‌లోని ఈ రాష్ట్రాలు విస్తీర్ణంలో చిన్నవే అయినా ప్రకృతి అందాలతో పరిమళిస్తాయి..సాంస్కృతిక వైభవంతో అబ్బురపరుస్తాయి.

Published : 06 Dec 2022 05:38 IST

ఈశాన్య రాష్ట్రాల్లో చకచకా పనులు
చైనా సరిహద్దు తవాంగ్‌ వరకు భారీ రైల్వే లైన్‌కు తుది సర్వే
వచ్చే ఏడాది చివరికి రైల్వే పటంలోకి సిక్కిం
ఈనాడు - హైదరాబాద్‌

అరుణాచల్‌ప్రదేశ్‌, అస్సాం, మణిపూర్‌, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర, సిక్కిం.. ఈశాన్య భారత్‌లోని ఈ రాష్ట్రాలు విస్తీర్ణంలో చిన్నవే అయినా ప్రకృతి అందాలతో పరిమళిస్తాయి..సాంస్కృతిక వైభవంతో అబ్బురపరుస్తాయి. భూభాగంలో అత్యధిక విస్తీర్ణం అడవుల మయం.. ఏడాదిలో అత్యధిక రోజుల వర్షపాతం.. చైనా, బంగ్లాదేశ్‌, మయన్మార్‌, భూటాన్‌, నేపాల్‌ వంటి పలు దేశాలతో పంచుకునే సరిహద్దులు.. ఇలా ఎన్నెన్నో ప్రత్యేకతల కలబోతగా కనిపిస్తాయి. ఎత్తైన కొండలు, లోయలతో చుట్టుముట్టి ఉండే ప్రాంతం కావడంతో రోడ్డు ప్రయాణం అంత సురక్షితం కాదు. పైగా ఎంతో సమయం పడుతుంది. ఇక్కడి రైల్వే నెట్‌వర్క్‌ చాలా పరిమితం. నేటికీ పలు రాష్ట్రాల రాజధానులకే రైల్వే అనుసంధానత లేదు. ఇకపై ఈ పరిస్థితిని సాధ్యమైనంతగా మార్చేలా రైల్వేశాఖ భారీ వ్యయంతో కొత్త ప్రాజెక్టులు మంజూరుచేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దులకు, వ్యూహాత్మక ప్రాంతాలకు వేగంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా కొన్నింటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. పనులు మొదలైనవాటిలో వేగం పెంచుతోంది. ఈశాన్య రాజధానులు అన్నింటినీ చుట్టి వచ్చేలా అనుసంధాన ప్రాజెక్టులూ చేపడుతున్నట్లు రైల్వే వర్గాలు చెబున్నాయి. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లోని గువాహటి, చిరపుంజి, షిల్లాంగ్‌, తవాంగ్‌, గ్యాంగ్‌టక్‌, నాథులాపాస్‌ వంటి ప్రాంతాలతో పాటు భూటాన్‌కూ పెద్దసంఖ్యలో పర్యాటకులు వెళ్లి వస్తుంటారు. వీటిలో కొన్నింటికే రైల్వే నెట్‌వర్క్‌ ఉండటంతో చాలామంది విమానాల్లో వెళ్లి వస్తుంటారు. భారతీయ రైల్వే చేపడుతున్న ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేస్తే తక్కువ వ్యయంతోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లిరావచ్చు.

తవాంగ్‌ మార్గంలో 80% సొరంగం

*  తవాంగ్‌.. అరుణాచల్‌ప్రదేశ్‌లో పేరొందిన ఈ పట్టణం ఏడాదంతా పర్యాటకుల్ని ఆకర్షిస్తుంది. వెళ్లడానికి రైలుమార్గం లేదు. దీంతో భలూక్పాంగ్‌-తవాంగ్‌ల మధ్య రైల్వేలైను(378 కి.మీ.) నిర్మాణ ప్రతిపాదనలున్నాయి. తుది సర్వే జరుగుతోంది. ఈ మార్గం 500 నుంచి 13వేల అడుగుల ఎత్తు వరకు వెళుతుంది. 80 శాతం సొరంగమార్గమే. అతిపెద్ద సొరంగ విస్తీర్ణం 29 కి.మీ. వరకు ఉంటుందని అంచనా. వచ్చే బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టు మంజూరయ్యే అవకాశాలున్నాయి. నిర్మాణానికి ఏడెనిమిదేళ్లు పడుతుంది. ఇది పూర్తయితే రోడ్డుమార్గం కన్నా 120 కి.మీ. దూరం తగ్గుతుంది. పర్యాటకులకే కాదు, సైన్యాన్ని తరలించడానికి, నిత్యావసరాల రవాణాకూ ఉపయోగపడుతుంది. ఆక్రమిత టిబెట్‌ రాజధాని లాసా నుంచి నియాంగ్చి వరకు చైనా నిర్మించిన బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు తవాంగ్‌కు చేరువలోనే ఉంటుంది.

* అరుణాచల్‌ప్రదేశ్‌లోని సిల్పత్తర్‌-ఎలాంగ్‌..నడుమ దేశ సరిహద్దు ప్రాంతాల మీదుగా కొత్త రైల్వే మార్గం కోసం తుది సర్వే జరుగుతోంది.  పై రెండూ దేశ సరిహద్దులో వ్యూహాత్మకం కానున్నాయి. వీటి నిర్మాణ వ్యయం రూ.60వేల కోట్లని అంచనా.

*  పశ్చిమబెంగాల్‌లోని సెవొకా-సిక్కింలోని రంగ్‌పో రైల్వేలైను 2023 డిసెంబరులో పూర్తికానుంది. ఇది అందుబాటులోకి వస్తే రైల్వే పటంలో సిక్కిం చేరుతుంది. రంగ్‌పో నుంచి రాష్ట్ర రాజధాని గ్యాంగ్‌టక్‌ వరకు రైల్వేలైనుకు సర్వే మంజూరయ్యింది. ప్రాజెక్టు వస్తే గ్యాంగ్‌టక్‌, నాథులాపాస్‌ పర్యాటకులకు ఉపయోగకరం.

*  మిజోరాం, మణిపూర్‌ రాష్ట్రాల రాజధానుల్ని అనుసంధానించే రైల్వే ప్రాజెక్టు ఏడాదిలో అందుబాటులోకి రానుంది.

*  నాగాలాండ్‌, సిక్కిం రాజధానుల్ని అనుసంధానం చేసే ప్రాజెక్టు కూడా ఉంది.

భూటాన్‌కూ రైలుమార్గం

*  అస్సాంలోని కొక్రాజర్‌ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకు రైలుమార్గం 58కి.మీ. మేర కొత్త ప్రాజెక్టు చేపట్టేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం భూటాన్‌ వెళ్లే పర్యాటకులు పశ్చిమబెంగాల్లో హషిమరా స్టేషన్‌లో దిగి అక్కడినుంచి 17 కి.మీ. రోడ్డుమార్గంలో భూటాన్‌లోని ఫున్సలింగ్‌ చేరుకుంటున్నారు.

* ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే నెట్‌వర్క్‌ని పెంచడానికి నిధుల కేటాయింపులో ప్రాధాన్యం లభిస్తోందని, ప్రాజెక్టుల పనులూ వేగవంతంగా చేపడుతున్నామని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. కామాఖ్య, అగర్తల, సిల్చార్‌, న్యూ తిన్‌సుకియా స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధిచేసేందుకు రైల్వేశాఖ సిద్ధం అవుతోంది.

ఈశాన్యంలో ఇలా..

* 21: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు. 1,619 కి.మీ.

* 10: రెండో లైను(డబ్లింగ్‌) పనులు జరుగుతున్నవి. 1,209.43 కి.మీ.

* రూ.95,261.65 కోట్లు: కొత్త ప్రాజెక్టుల అంచనా వ్యయం

* 1,578 కి.మీ.: సర్వే పూర్తయిన కొత్త రైల్వే లైన్లు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని