సరిహద్దుల్లో మళ్లీ ఢీ
భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది.
కొట్టుకున్న భారత్, చైనా బలగాలు
ఇరు దేశాల సైనికులకు గాయాలు
అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో ఈ నెల 9న ఘటన
రాడ్లు, కర్రలతో వచ్చిన డ్రాగన్ దళాలు
దిల్లీ: భారత్, చైనా సరిహద్దుల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో రెండు దేశాలకు చెందిన పలువురు సైనికులు గాయపడ్డారు. తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్‌త్సె ప్రాంతం వద్ద ఈ నెల 9న చోటుచేసుకున్న ఈ ఘర్షణ తాలూకు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. భారతీయులతో పోలిస్తే చైనా సైనికులు చాలా ఎక్కువ మంది ఈ ఘర్షణలో గాయపడినట్లు తెలుస్తోంది. ‘‘డిసెంబరు 9న చైనా సైనికులు తవాంగ్ సెక్టార్‌లో ఎల్‌ఏసీ వెంబడి సున్నితమైన ప్రాంతంలోకి అడుగుపెట్టారు. అక్కడ గస్తీ నిర్వహిస్తున్న భారత బలగాలు వారిని అడ్డుకున్నాయి. దీంతో ఘర్షణ తలెత్తింది. రెండు వైపులా కొంతమంది సైనికులు గాయపడ్డారు’’ అని భారత సైన్యం సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఘర్షణ అనంతరం ఇరు దేశాల బలగాలు ఆ ప్రాంతం నుంచి వెనక్కి వెళ్లాయని సైన్యం తెలిపింది. అనంతరం అక్కడి భారత కమాండర్.. చైనా తరఫు కమాండర్‌తో సమావేశమై చర్చలు జరిపారని పేర్కొంది. సరిహద్దుల్లో తిరిగి శాంతియుత పరిస్థితులను నెలకొల్పే దిశగా చర్యలు చేపట్టారని వివరించింది. ఘర్షణ చెలరేగిన సమయంలో అక్కడ ఎంతమంది సైనికులు ఉన్నారు, ఎంతమంది గాయపడ్డారు వంటి వివరాలను వెల్లడించలేదు. తవాంగ్ సెక్టార్‌లో ఎల్‌ఏసీ వెంబడి ఎవరి భూభాగం ఎంతవరకు ఉందన్నదానిపై భారత్, చైనాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇరు దేశాల బలగాలు తమ సరిహద్దుగా వేర్వేరు రేఖలను చూపించుకుంటూ.. అక్కడివరకు గస్తీ తిరుగుతుంటాయి. 2006 నుంచీ ఇదే కొనసాగుతోందని భారత సైన్యం తెలిపింది. యాంగ్‌త్సె సమీపంలో ఇరు దేశాల బలగాల మధ్య గత ఏడాది అక్టోబరులో ప్రతిష్టంభన తలెత్తింది. స్థానిక కమాండర్ల చర్చల అనంతరం నాడు పరిస్థితులు సద్దుమణిగాయి. 2020 జూన్‌లో భారత్, చైనా బలగాలు తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్‌లో తీవ్రస్థాయిలో ఘర్షణ పడ్డాయి. నాటి ఘటనలో కర్నల్ సంతోష్ బాబు సహా 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. అదే ఏడాది ఆగస్టులో తూర్పు లద్దాఖ్‌లోనే రించెన్ లా ప్రాంతం వద్ద ఇరు దేశాల బలగాలు మరోసారి పరస్పరం దాడి చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత వాటి మధ్య మళ్లీ ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.
ఆరుగురు భారత సైనికులకు గాయాలు?
తవాంగ్ సెక్టార్‌లో చెలరేగిన ఘర్షణలో ఆరుగురు భారత సైనికులు గాయపడ్డారని తెలుస్తోంది. వారందరినీ గువాహటికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. 200 మందికిపైగా చైనా సైనికులు కర్రలు, ఇనుప ముళ్లతో కూడిన రాడ్లు పట్టుకొని యాంగ్‌త్సె వద్దకు వచ్చారు. వారికి భారత బలగాలు అత్యంత దీటుగా బదులిచ్చాయి. ఇరు దేశాల సైనికులకు స్వల్ప గాయాలయ్యాయని చెబుతున్నప్పటికీ.. కొందరి కాళ్లు, చేతులు విరిగాయని కూడా వార్తలొస్తుండటం గమనార్హం.
నేడు పార్లమెంటులో వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్న ఒవైసీ
అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా బలగాల మధ్య ఘర్షణ చెలరేగడంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ ఘటన గురించి పార్లమెంటుకు ప్రభుత్వం ఎందుకు తెలియజేయలేదని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై పార్లమెంటులో మంగళవారం వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. మరోవైపు- ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు బయటకు రాకుండా తొక్కి ఉంచుతోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టారని యువకుడికి నోటీసు.. మఫ్టీలో పులివెందుల పోలీసులు
-
India News
సికింద్రాబాద్ - అగర్తలా రైలులో షార్ట్ సర్క్యూట్
-
Ap-top-news News
Viveka Murder Case: ‘భాస్కరరెడ్డి బయట ఉంటే సాక్షులెవరూ ముందుకు రారు’
-
Ap-top-news News
Vijayawada: 9వ తేదీ వరకు పలు రైళ్ల రద్దు: విజయవాడ రైల్వే అధికారులు
-
Politics News
Sachin Pilot: సచిన్ పైలట్ కొత్త పార్టీ?
-
India News
Odisha Train Accident: పరిహారం కోసం ‘చావు’ తెలివి