..ఆ అరెస్టు ఓ భయానక ముప్పు: రాష్ట్రపతి

Eenadu icon
By National News Desk Published : 28 Oct 2025 05:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: డిజిటల్‌ అరెస్టు అనేది ప్రజల పాలిట ఇప్పుడో భయానక ముప్పుగా పరిణమించిందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు. సాంకేతికతలో వచ్చిన మార్పులు పోలీసింగ్‌ను సమూలంగా మార్చేశాయని చెప్పారు. సోమవారం రాష్ట్రపతి భవన్‌లో ప్రొబేషనరీ ఐపీఎస్‌లను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సైబర్‌ నేరగాళ్లు ప్రజలను బెదిరింపులకు గురిచేస్తూ భారీ మొత్తంలో డబ్బును కాజేస్తుండటంపై ఆందోళన వ్యక్తంచేశారు. ‘డిజిటల్‌ అరెస్టులు వంటివాటిని ఎదుర్కోవాలంటే సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పోలీసుల పట్ల ప్రజలకు, ముఖ్యంగా బడుగువర్గాలవారికి అనవసర భయం తగదు. పోలీసులు తమకు రక్షణగా నిలుస్తారనే భావన వారిలో కలగాలి. సైబర్‌ నేరగాళ్లు వీడియో కాల్స్‌ చేసి తాము పోలీసులమని బెదిరిస్తారు. చెప్పినట్లు చేయకపోతే డిజిటల్‌ అరెస్టు చేస్తామని భయపెడతారు. ప్రజలు చాకచక్యంగా వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సైబర్‌ నేరగాళ్లు పోలీసుల మాదిరి ప్రజలను నమ్మించి మోసం చేస్తుండటంతో అసలైన పోలీసులు ఎవరనే విషయాన్ని వారు గ్రహించలేకపోతారు’ అని ముర్ము చెప్పారు. ఆర్థికంగా ఎదుగుతున్న ఏ రాష్ట్రానికైనా పెట్టుబడుల్ని ఆకట్టుకోవాలంటే శాంతిభద్రతలు ఎంతో కీలకమన్నారు. 174 మంది ప్రొబేషనర్లలో 62 మంది మహిళలు ఉండటం ముదావహమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు