Kerala: గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో డ్రైవింగ్‌.. నీటి ప్రవాహంలోకి కారు

ఓ కుటుంబం గూగుల్‌ మ్యాప్స్‌ చూస్తూ వాహనంలో ప్రయాణిస్తుండగా వారి కారు నీటి ప్రవాహంలో మునిగిపోయిన ఘటన కేరళలోని కొట్టాయంలో జరిగింది.

Published : 25 May 2024 14:31 IST

కొట్టాయం: తెలియని, కొత్త ప్రదేశాలకు వెళ్తున్న సమయంలో సాధారణంగా  ప్రజలు తమ గమ్య స్థానాలను చేరుకోవడానికి  గూగుల్‌ మ్యాప్స్‌ (Google maps)ను ఉపయోగిస్తారు. కాని ఒక్కోసారి తప్పు దారులను చూపించడంతో ప్రమాదాల బారిన పడ్డవారు చాలామందే ఉన్నారు. జీపీఎస్‌ కనెక్టివిటీ, సాంకేతిక లోపాల కారణంగా ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశముంటుంది. అటువంటి సంఘటనే కేరళ(Kerala)లోని కొట్టాయంలో చోటుచేసుకుంది.

హైదరాబాద్‌కు చెందిన ఓ పర్యాటక బృందం కేరళ  వెళ్లారు. వారు గూగుల్‌ మ్యాప్స్‌ సహాయంతో అలప్పుళ ప్రాంతానికి వెళ్తుండగా శుక్రవారం అర్థరాత్రి కురుప్పంతర (Kuruppanthara) ప్రాంతంలో  వారి కారు నీటి ప్రవాహంలో మునిగిపోయింది. వాహనం నీటిలో మునిగిపోవడాన్ని గమనించిన స్థానికులు పోలీస్‌ పెట్రోలింగ్‌ యూనిట్‌ సహాయంతో అందులోని పర్యటకులను రక్షించారు.  ఓ మహిళతో సహా నలుగురు సురక్షితంగా బయటపడ్డారని, కారు నీటిలో మునిగిపోయిందని పోలీసులు తెలిపారు. వాహనాన్ని బయటకు తీయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని వారు పేర్కొన్నారు.  

గత ఏడాది అక్టోబరులో ఇద్దరు యువ వైద్యులు వర్షంలో మ్యాప్స్‌ను అనుసరిస్తూ వెళ్లి నదిలో మునిగి మరణించారు. ఈ ఘటన అనంతరం కేరళ పోలీసులు వర్షాకాలంలో సాంకేతికతను ఉపయోగించే వారికి పలు హెచ్చరికలు, మార్గదర్శకాలు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని