Ayodhya Ram Mandir: శరవేగంగా సాగుతున్న అయోధ్యలో రామ మందిర నిర్మాణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయని మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. అక్టోబరు చివరి నాటికి గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. 

Published : 12 Jun 2023 23:50 IST

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని అయోధ్య (Ayodhya)లో చేపట్టిన రామ మందిర (Ram Mandir) నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందని రామ మందిర నిర్మాణ కమిటీ ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్రా తెలిపారు. ప్రస్తుతం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని వెల్లడించారు. ‘‘ ఇటీవలే రామ జన్మభూమి ట్రస్ట్‌ సీనియర్ సభ్యులు మందిర నిర్మాణాన్ని పరిశీలించారు. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ట్రస్ట్‌ సభ్యులు ఎప్పటికప్పుడు నిర్మాణ పనులను పర్యవేక్షిస్తూ.. సూచనలు చేస్తున్నారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం చివరి దశలో ఉంది. ఈ ఏడాది అక్టోబరు నాటికి దీని నిర్మాణం పూర్తవుతుంది’’ అని నృపేంద్ర మిశ్రా తెలిపారు. 

మూడంతస్తుల ఆలయ నిర్మాణంలో భాగంగా రాజస్థాన్‌లోని బన్సీ పహర్‌పూర్‌ నుంచి తెచ్చిన రాతిని అమర్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. రామ మందిరంలో గర్భగుడితోపాటు ఐదు మండపాలు ఉంటాయి. గుధ్‌ మండపం, రంగ మండపం, నిత్య మండపం, ప్రధాన మండపం, కీర్తన మండపం. ఈ ఐదు మండపాల గోపురాల పరిమాణం 34 అడుగుల వెడల్పు, 32 అడుగుల ఎత్తులో ఉంటాయి. ఆలయం పొడవు 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు. గర్భగుడి మొత్తాన్ని మక్రానా పాలరాతి స్థంభాలతో నిర్మిస్తున్నారు. బరువు, వాతావరణపరంగా ఎదురయ్యే సవాళ్లను పరిగణలోకి తీసుకుని ఆలయం మొత్తంలో 392 స్థంబాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం మొత్తం వైశాల్యం 8.64 ఎకరాలు. వచ్చే ఏడాది జనవరి కల్లా భక్తుల దర్శనార్థం రామ మందిరాన్ని అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని