Congress: కాంగ్రెస్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

ఐటీ విభాగం ఆదేశాలపై కాంగ్రెస్‌ పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు కొట్టేసింది. దీంతో రూ.100 కోట్ల పన్ను చెల్లింపు వ్యవహారంలో ఆ పార్టీకి చుక్కెదురైనట్లైంది. 

Updated : 22 Mar 2024 16:23 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తమ పార్టీ ఆదాయపు పన్ను చెల్లింపుపై ఐటీ విభాగం చేపట్టిన పునఃపరిశీలనను కొట్టివేయాలని కోరుతూ కాంగ్రెస్‌ (Congress) దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు నేడు కొట్టేసింది. దీన్ని జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ, జస్టిస్‌ పురుషీంద్ర కుమార్‌ కౌరవ్‌లతో కూడిన బెంచ్‌ విచారించింది. అనంతరం తీర్పు వెలువరిస్తూ ఆ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. మార్చి 20న ఈ కేసులో వాదోపవాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం తెలిసిందే. 

2014-15, 2015-16, 2016-17 సంవత్సరాలకు సంబంధించిన కాంగ్రెస్‌ ఆదాయంపై ఐటీశాఖ పునఃపరిశీలన చేపట్టింది. దీనిని ఆపాలని ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్‌ పక్షాన పార్టీ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. పునఃపరిశీలనకు ఉన్న గడువు తీరిపోయిందని.. కేవలం ఆరేళ్లు మాత్రమే వెనక్కివెళ్లి అధికారులు పరిశీలించే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీనికి ఐటీశాఖ సమాధానం ఇస్తూ.. తాము నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొంది. స్వాధీనం చేసుకొన్న ఆధారాలను బట్టి రూ.520 కోట్ల మేరకు తేడాలు వస్తున్నట్లు పేర్కొంది.

ఆ పార్టీ మొత్తం రూ.100 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించాలని ఐటీ విభాగం ఇటీవలే నోటీసులు జారీ చేసింది. దీనిపై అప్పిలేట్‌ ట్రైబ్యూనల్‌ను ఆశ్రయించింది. అది కాంగ్రెస్‌ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమని ఇటీవలే హైకోర్టు కాంగ్రెస్‌ పార్టీకి తెలిపింది. ఇక పునః పరిశీలన ఆపే అంశాన్ని నేడు కొట్టివేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని