Police Drags Bride: పెళ్లి పీటలపై నుంచి వధువును లాక్కెళ్లిన పోలీసులు..

Kerala police drags away bride: పీటలపై పెళ్లిని అడ్డుకున్న పోలీసులు వధువును బలవంతంగా లాక్కెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. సినిమాను తలపించే ఈ ఘటన కేరళలోని కోవలంలో చోటుచేసుకుంది. 

Updated : 19 Jun 2023 16:30 IST

తిరువనంతపురం: సినిమాల్లో పెళ్లి సీన్లలో సరిగ్గా మూడుముళ్లు వేసే సమయానికి ‘ఆపండి’ అనే డైలాగ్‌ వింటుంటాం. కేరళ (Kerala)లోని ఓ వివాహ వేడుకలో సరిగ్గా ఇలాంటి సీనే కన్పించింది. వధువు (Bride) మెడలో వరుడు (Groom) తాళికట్టడానికి కొద్ది క్షణాల ముందు మండపంలోకి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. వధువును బలవంతంగా పీటలపై నుంచి లాక్కెళ్లి కోర్టుకు తీసుకెళ్లారు. ఇంతకీ ఆ పెళ్లిని పోలీసులు ఎందుకు ఆపారు? అసలేం జరిగింది? అంటే.. (Kerala police drags away bride)

కోవలం ప్రాంతానికి చెందిన అల్ఫియా, అఖిల్‌ ప్రేమించుకున్నారు. మతాలు వేరవడంతో కుటుంబసభ్యులు వీరి బంధాన్ని అంగీకరించలేదు. దీంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయి ఆదివారం స్థానిక ఆలయంలో పెళ్లి (Marriage) ఏర్పాట్లు చేసుకున్నారు. సరిగ్గా తాళి కట్టే సమయానికి పోలీసులు (Kerala Police) ఆలయానికి వెళ్లారు. అల్ఫియాను బలవంతంగా అక్కడి నుంచి కోవలం పోలీస్‌స్టేషన్‌ను తీసుకొచ్చారు. తాను రానని అల్ఫియా అరుస్తుండగా ఆమెను బలవంతంగా ఓ ప్రైవేటు వాహనంలోకి ఎక్కించారు. వరుడు అఖిల్‌ ఆమె దగ్గరకు వెళ్తుంటే పోలీసులు అతడిని అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. దీంతో కేరళ పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి.

దీనిపై అలప్పుళ జిల్లా సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. అల్ఫియా కన్పించకుండా పోయినట్లు తమకు ఫిర్యాదు అందిందని, దానిపై తాము దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ఆమె పెళ్లి చేసుకుంటుందని తెలిసి అక్కడకు వెళ్లామని, కోర్టు ఆదేశాల మేరకు ఆమెను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టామని చెప్పారు. అయితే మేజర్‌ అయిన ఆమె అఖిల్‌తోనే వెళ్తానని చెప్పడంతో కోర్టు అందుకు అంగీకరించిందని తెలిపారు. ఆ తర్వాత వారిద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.

దీనిపై అల్ఫియా, అఖిల్‌ సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘‘అఖిల్‌తో కలిసి జీవించడం మా అమ్మానాన్నలకు ఇష్టంలేదు. వారు నన్ను బలవంతంగా తీసుకెళ్లాలనుకున్నారు. అందుకే నేను కన్పించట్లేదని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నన్ను బలవంతంగా తీసుకెళ్లి కోర్టులో హాజరుపర్చారు. కానీ, నా ఇష్టపూర్వకంగానే అఖిల్‌తో వెళ్లానని నేను కోర్టులో చెప్పాను. దీంతో మమ్మల్ని వారు వెళ్లనిచ్చారు’’ అని అల్ఫియా తెలిపింది. అయితే, పోలీసులు తమతో అమానుషంగా ప్రవర్తించారని, బలవంతంగా ఆమెను లాక్కెళ్లడమే గాక.. తనను తోసేశారని అఖిల్‌ ఆరోపించాడు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా.. పోలీసుల ఎంట్రీతో ఆగిపోయిన తమ పెళ్లి మంగళవారం జరగనున్నట్లు అల్ఫియా, అఖిల్‌ చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని