Piyush Goyal: ప్రపంచ దేశాలతో పోటీ పడే సామర్థ్యం భారత్‌కు ఉంది: పీయూష్ గోయల్‌

Eenadu icon
By National News Team Published : 05 Jul 2025 19:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ (Piyush Goyal) కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఆ పార్టీ నేతలు జాతీయ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ఇతర దేశాలతో ఒప్పందాలు చేసుకున్నారని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం దేశ ప్రజల గురించి పట్టించుకోకపోవడం వల్ల బలహీనంగా మారిన దేశాన్ని బలమైన, అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారన్నని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వానికి జాతీయ ప్రయోజనాలే మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. భారత్‌కు ప్రపంచంలోని ఏ దేశంతో అయినా పోటీ పడగలిగే సామర్థ్యం ఉందని తాము విశ్వాసిస్తున్నామన్నారు. దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సుంకాల విషయంలో ప్రధాని ఓ నిర్ణయం తీసుకుంటారని స్పష్టం చేశారు.

ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటే మాత్రమే ఏ దేశంతో అయినా వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడానికి భారత్‌ సంసిద్ధతను వ్యక్తం చేస్తుందని గోయల్‌ అన్నారు. అలా కానీ పక్షంలో ఎట్టిపరిస్థితుల్లోనే ప్రపంచ దేశాలతో వాణిజ్య సంబంధాలను ఏర్పరుచుకోమని స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్‌.. మారిషస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, నార్వే, యూకే వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుందని గోయల్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఈయూ దేశాల కూటమి, అమెరికా, ఒమన్‌, పెరూ, చిలీ సహా ఇతర అభివృద్ధి చెందిన దేశాలతోనూ వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తోందని అన్నారు.

అమెరికా (US) అధ్యక్షుడు ట్రంప్‌ భారత్‌పై 26 శాతం సుంకాలు విధిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. యూఎస్‌ పరస్పర సుంకాల సస్పెన్షన్‌ జులై 9న ముగియనున్నందున, ఆ గడువుకు ముందే చర్చలు పూర్తి చేయాలని ఇరుదేశాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ (Congress) కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. సమయం దాటిపోతున్నా ప్రధాని మోదీ సుంకాల తగ్గింపునకు అగ్రరాజ్యంతో ఎటువంటి చర్చలు జరపట్లేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ఇలాగే నిశ్శబ్దంగా ఉండి చివరికి ట్రంప్‌ విధించిన సుంకాలకు తలొగ్గడం తప్ప వేరే దారి ఉండదని వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని