Online Voting: వారికి ఆన్‌లైన్‌ ఓటింగ్‌ కల్పించాలి: మాజీ సీఈసీ కృష్ణమూర్తి

వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సౌలభ్యాన్ని తీసుకురావాలని, రాజకీయ పార్టీలు కూడా భౌతికంగా బహిరంగ సభలను తగ్గించి, ఆన్‌లైన్‌ ప్రచారాన్ని చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎస్‌ కృష్ణమూర్తి సూచించారు.

Published : 18 Mar 2024 23:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం ఆన్‌లైన్‌ ఓటింగ్‌ సౌలభ్యాన్ని తీసుకురావాలని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్‌ టీఎస్‌ కృష్ణమూర్తి సూచించారు. తాను పదవిలో ఉన్న సమయంలోనే ఈ అంశాన్ని పరిశీలించామని, ఐఐటీ మద్రాస్‌తోనూ అనధికారికంగా సంప్రదింపులు చేశామని వెల్లడించారు. ఇక రాజకీయ పార్టీలు కూడా భౌతికంగా బహిరంగ సభలను తగ్గించి, ఆన్‌లైన్‌ ప్రచారాన్ని చేసేందుకు ఉన్న మార్గాలను అన్వేషించాలన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాజీ సీఈసీ మట్లాడారు. 

‘ఆన్‌లైన్‌ ఓటింగ్‌ను అనుమతించే దేశాలు ఉన్నప్పటికీ.. మన దేశంలో మాత్రం రాజకీయ పార్టీల సమ్మతితో ముందుకు వెళ్లాలి. కనీసం వయోవృద్ధులు, దివ్యాంగులు, సర్వీసు ఓటర్లకు ఇంటర్నెట్‌ ఓటింగ్‌ అవకాశం కల్పించవచ్చనేది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని మాజీ సీఈసీ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనిపై తీవ్రంగా ఆలోచించాలన్నారు. డిజిటల్‌ సాంకేతికత విస్తృతంగా అందుబాటులో ఉన్న తరుణంలో.. ప్రచారం కోసం భౌతిక సమావేశాలు తగ్గించే అంశాన్ని రాజకీయ పార్టీలు ఆలోచించాలన్నారు. ఎన్నికల ముందు ఎన్నో బహిరంగ సభలను చూస్తున్నామన్నారు.

మెక్సికోలో ఎన్నికల సమయంలో తాను ఆ దేశాన్ని సందర్శించిన విషయాన్ని గుర్తు చేసుకున్న ఆయన.. అక్కడ భౌతిక సమావేశాలు అతి తక్కువగా ఉన్నాయన్నారు. అక్కడ ఎక్కువగా టీవీ, ఆన్‌లైన్‌లోనే ప్రచారం జరుగుతోన్న విషయాన్ని వెల్లడించారు. భౌతిక సమావేశాలతో ప్రజల మధ్య అనవసర గొడవలు, హింస వంటివి చెలరేగే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. 13వ భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన కృష్ణమూర్తి సారథ్యంలోనే 2004 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని