Arvind Kejriwal: కేజ్రీవాల్‌ సతీమణికి.. కల్పనా సోరెన్‌ సంఘీభావం

అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో.. ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ శనివారం సునీతా కేజ్రీవాల్‌ను కలిసి సంఘీభావం తెలిపారు.

Published : 30 Mar 2024 21:45 IST

దిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టయిన ఆప్‌ చీఫ్‌ కన్వీనర్‌, దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జేఎంఎం అధినేత, ఝార్ఖండ్‌ మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సతీమణి కల్పనా సోరెన్‌ (Kalpana Soren) శనివారం సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. దిల్లీలోని నివాసానికి చేరుకుని.. ఆమెకు సంఘీభావం తెలిపారు. ఈ ఇద్దరు శక్తిమంతమైన మహిళల భేటీని చూసి భాజపా భయపడుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ ‘ఎక్స్‌’ వేదికగా వ్యాఖ్యానించారు.

‘‘సునీతను కలిసి.. ధైర్యం చెప్పాను. స్నేహితురాలిగా వారి సమస్యలను అర్థం చేసుకోగలను. ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికైన ముఖ్యమంత్రులను లోక్‌సభ ఎన్నికల వేళ అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య దేశంలో సాధారణ విషయం కాదు. ప్రస్తుత సంక్షోభ సమయంలో మొత్తం ఝార్ఖండ్.. దిల్లీ ముఖ్యమంత్రికి అండగా నిలుస్తోంది. కలిసికట్టుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాం’’ అని కల్పన పేర్కొన్నారు. ఈ భేటీపై ఆతిశీ స్పందిస్తూ.. ‘‘తమ భర్తలపై కేంద్ర సంస్థల అధికార ఒత్తిడికి బెదరని ఈ ఇద్దరు మహిళల సమావేశాన్ని చూసి భాజపా భయపడుతుంది. వారిద్దరి ధైర్యానికి సెల్యూట్’’ అని ట్వీట్‌ చేశారు.

అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టును ఆయన సతీమణి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దేశంలో అత్యంత అవినీతి, నియంత శక్తులకు వ్యతిరేకంగా ఆయన పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో జనవరి 31న హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ‘‘భాజపాతో చేతులు కలిపి ఉంటే ఆయన జైలులో ఉండేవారు కాదు. కానీ, ఆయన సత్య మార్గాన్ని వీడలేదు. హేమంత్‌కు నా సెల్యూట్‌’’ అని కేజ్రీవాల్‌ అప్పట్లో మద్దతుగా నిలిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని