LS polls: కేజ్రీవాల్‌, సునీత, సిసోదియా.. గుజరాత్‌లో ‘AAP’ స్టార్‌ క్యాంపెయినర్లు

ప్రస్తుతం జైల్లో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia), మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌లను గుజరాత్‌లో ఆమ్ఆద్మీపార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది.

Published : 16 Apr 2024 20:03 IST

గాంధీనగర్‌: దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), ఆప్‌ సీనియర్‌ నేత మనీశ్‌ సిసోదియా (Manish Sisodia), మాజీ మంత్రి సత్యేందర్‌ జైన్‌లు ప్రస్తుతం జైల్లో ఉన్న విషయం తెలిసిందే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా గుజరాత్‌లో వీరిని ఆమ్ఆద్మీ పార్టీ స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చింది. వీరితో పాటు కేజ్రీవాల్‌ సతీమణి సునీత, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌లూ ఉన్నారు.

మొత్తంగా 40 మందితో కూడిన జాబితాను ఎన్నికల సంఘానికి ఆమ్‌ఆద్మీ పార్టీ అందజేసింది. ఆప్‌ రాజ్యసభ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, సందీప్‌ పాఠక్‌ల పేర్లను ఈ జాబితాలో పొందుపరిచింది. మరికొందరు రాజ్యసభ ఎంపీలు హర్భజన్‌ సింగ్‌, స్వాతి మాలివాల్‌ల పేర్లు ఇందులో లేకపోవడం గమనార్హం.

దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మార్చి 21న అరెస్టు చేసింది. జ్యుడీషియల్‌ కస్టడీలో భాగంగా ప్రస్తుతం ఆయన తిహాడ్‌ జైల్లో ఉన్నారు. అక్కడినుంచే పాలనకు సంబంధించి ఆదేశాలు ఇస్తున్నారు. ఇదిలాఉంటే, గుజరాత్‌లో మొత్తం 26 లోక్‌సభ స్థానాలుండగా.. ‘ఇండియా’ కూటమిలో ఆప్‌ రెండుచోట్ల పోటీ చేస్తోంది. మిగతా 24 స్థానాల్లో కాంగ్రెస్‌ బరిలో నిలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా గుజరాత్‌లో అన్ని స్థానాలకు మే 7న ఒకేరోజు పోలింగ్‌ జరగనుంది. ఏప్రిల్‌ 19 నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలుకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని