Congress: రైళ్ల రద్దీ.. అమితాబ్‌ సహాయం కోరిన కాంగ్రెస్‌

ప్రయాణికులతో కిక్కిరిసి వెళ్తోన్న ఒక రైలు వీడియోను షేర్ చేసిన కాంగ్రెస్‌.. బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan) సహాయం కోరింది. ఎందుకంటే..?

Updated : 31 May 2024 12:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రజా సమస్యలను కేంద్రం వద్ద లేవనెత్తేందుకు కాంగ్రెస్ (Congress) పార్టీ వినూత్న మార్గాన్ని ఎంచుకుంది. ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్‌ (Amitabh Bachchan ) పేరును ప్రస్తావించి ప్రజల ఇక్కట్లను కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఇంతకీ విషయం ఏంటంటే..?

రైలులో రద్దీ ఎక్కువగా ఉన్న దృశ్యాలను కేరళ కాంగ్రెస్ (Congress) ‘ఎక్స్‌’ వేదికగా షేర్ చేసింది. ‘‘అమితాబ్‌ బచ్చన్‌జీ..మీ నుంచి మాకో సహాయం కావాలి. కోట్లాది మంది సామాన్య ప్రజలు ఈ విధంగా ప్రయాణించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. చివరకు రిజర్వేషన్ చేసుకున్న బోగీలు కూడా ఇలాగే ఉంటున్నాయి. ప్రస్తుతం ఉత్తర భారతంలో 50 డిగ్రీల కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈ సమయంలో యూపీలోని గోరఖ్‌పుర్‌ నుంచి వచ్చిన వీడియో అది’’ అంటూ రాసుకొచ్చింది. అది యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సొంతూరు అని పేర్కొంది. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా రైళ్ల సంఖ్యను పెంచడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ విమర్శించింది. కొన్ని వందే భారత్‌ రైళ్లను తీసుకొచ్చారు కానీ, అందులో సగం ఖాళీగానే తిరుగుతున్నాయని ఆరోపించింది. అయితే.. ఆ కిక్కిరిసిన రైలులో ఉక్కపోతతో ప్రయాణికులు ప్లాస్టిక్ విసనకర్రలతో విసురుకోవడం కనిపిస్తోంది.

24 గంటలపాటు ఆలస్యం.. విమానంలో స్పృహ తప్పిన ప్రయాణికులు

అందుకే అమితాబ్ పేరు వాడాం..

తమ పోస్టులో అమితాబ్‌ పేరు వాడటం వెనక ఉన్న కారణాన్ని హస్తం పార్టీ వివరించింది. గతంలో అధికారిక మార్గాల ద్వారా తాము ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, రైళ్ల సంఖ్యను పెంచాలన్న తమ అభ్యర్థనకు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ నుంచి స్పందన రాలేదని చెప్పింది. అదే సెలబ్రిటీలు, ప్రముఖులు లేవనెత్తే చిన్నపాటి సమస్యలకు వెంటనే స్పందించి, పరిష్కరిస్తుంటారని కేంద్రాన్ని దుయ్యబట్టింది. అందుకే ప్రముఖ నటుడి పేరును ఉపయోగించినట్లు చెప్పింది. ‘‘ సమాజంలో మీరెంతో ప్రభావవంతమైన వ్యక్తి. సామాజిక సమస్యల పట్ల మీరు గళమెత్తుతుంటారు. అందుకే ఈ అంశంపై మీరు స్పందించాలని కోరుతున్నాం. మీ సహకారం వల్ల వారి సమస్యకు పరిష్కారం లభించొచ్చు’’ అని వివరణ ఇచ్చింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని