Bihar polls: ‘ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం’ - మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో

Eenadu icon
By National News Team Updated : 28 Oct 2025 22:45 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: బిహార్‌లో తొలి దశ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) సమయం దగ్గర పడుతున్న వేళ ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో విపక్ష కూటమి మహాగఠ్‌బంధన్‌ మ్యానిఫెస్టో (INDIA bloc's Manifesto) విడుదల చేసింది. ‘తేజస్వీ ప్రతిజ్ఞా ప్రణ్‌’ పేరుతో ఈ మ్యానిఫెస్టోను ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేడా తదితరుల సమక్షంలో విడుదల చేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ తదితర హామీలు ఇందులో పేర్కొన్నారు. బిహార్‌ను అభివృద్ధిపథంలో నడిపించడంతోపాటు దేశంలో నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్‌ వెల్లడించారు.

అంతకుముందు పార్సా, సారణ్‌ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వి.. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం స్వేచ్ఛగా లభిస్తోందని, ఇంటికే నేరుగా మద్యం సరఫరా అవుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో తాము అధికారంలోకి వస్తే నిషేధం నుంచి కల్లుకు మినహాయింపు ఇస్తామన్నారు. విద్య, ఆరోగ్య సదుపాయాలు, ఉపాధి, సాగునీటిని అందించే ప్రభుత్వాన్ని బిహార్‌ ప్రజలు కోరుకుంటున్నారని.. గత ఇరవై ఏళ్లలో ఎన్డీయే కూటమి వీటిని చేపట్టలేకపోయిందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే వీటిని పూర్తి చేసి చూపిస్తామన్నారు.

నిత్యం దోపిడీలు..

‘‘సారణ్‌లో హత్యలు, దోపిడీ, అపహరణలు నిత్యకృత్యమయ్యాయి. అయినప్పటికీ సీఎం నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) పట్టించుకోవడం లేదు. ఒక్కసారి కూడా బాధితులను పరామర్శించలేదు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. విపక్ష కూటమి అధికారంలోకి వస్తే శాంతిభద్రతలను కాపాడటంతోపాటు ఉద్యోగాల కల్పన, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తాం’’ అని తేజస్వీ యాదవ్‌ పేర్కొన్నారు. 

బిహార్‌లో 2016 నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు అవుతోంది. మద్యం తయారీ, అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ ఉల్లంఘనలు జరుగుతున్నాయనే విమర్శలు ఉన్నాయి. మరోవైపు ప్రశాంత్‌ కిశోర్‌ నేతృత్వంలోని జన్‌ సురాజ్‌ పార్టీ కూడా తాము అధికారంలోకి వస్తే మద్యం నిషేధాన్ని ఎత్తివేస్తామని ఇదివరకే ప్రకటించింది. 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్‌లో నవంబర్‌ 6 తొలిదశ, నవంబర్‌ 11న రెండోదశలో పోలింగ్‌ జరగనుంది.

Tags :
Published : 28 Oct 2025 17:21 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని