Kharge: ఆరెస్సెస్‌ను నిషేధించాలి

Eenadu icon
By National News Desk Updated : 01 Nov 2025 05:27 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

పటేల్‌ వారసత్వాన్ని మోదీ అవమానిస్తున్నారు 
కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే వ్యాఖ్యలు

దిల్లీలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. చిత్రంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ 

దిల్లీ: దేశంలో శాంతిభద్రతల సమస్యలు ఎక్కువగా తలెత్తడానికి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌(ఆరెస్సెస్‌), భాజపాలే కారణమని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. అలాంటి ఆరెస్సెస్‌ను నిషేధించాలంటూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆయన బయటపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆరెస్సెస్‌తో అనుసంధామయ్యేందుకు అనుమతినివ్వడం ద్వారా.. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ వారసత్వాన్ని ప్రధాని నరేంద్ర మోదీ అవమానిస్తున్నారని ఆయన మండిపడ్డారు. పటేల్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌పై మోదీ చేసిన ఆరోపణలను ఖర్గే తిప్పికొట్టారు. 1948లో మహాత్మాగాంధీ హత్యకు దారితీసిన వాతావరణాన్ని ఆరెస్సెస్‌ సృష్టించిందని విమర్శిస్తూ పటేల్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన ఉదాహరించారు.

‘‘ఆరెస్సెస్‌ను నిషేధించాలన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్, ఉక్కు మహిళ ఇందిరా గాంధీలు గొప్ప నేతలు. వారిరువురు ఐక్యతను కాపాడేందుకు కృషి చేయడంతో పాటు దేశానికి ఎంతో సేవచేశారు. భారత మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పటేల్‌ మధ్య గొప్ప సంబంధాలు ఉన్నప్పటికీ, వారిరువురి మధ్య చీలిక తెచ్చేందుకు నిత్యం ప్రయత్నించేవారు. దేశ ఐక్యతకు ప్రతీకగా నిలిచిన పటేల్‌ను నెహ్రూ ప్రశంసించారు. ఐక్యతను తీసుకురావడానికి, శాంతిని నెలకొల్పడానికి పటేల్‌ పోరాడారు’’ అని ఖర్గే పేర్కొన్నారు. కశ్మీర్‌ మొత్తాన్ని భారత్‌లో కలపాలని పటేల్‌ కోరుకున్నప్పటికీ, నాటి ప్రధాని నెహ్రూ ఆ ప్రయత్నాలను అడ్డుకొన్నారని మోదీ చేసిన ఆరోపణలపై ఖర్గే ఈ మేరకు స్పందించారు. 

మోదీ ఇంకా చక్రవర్తి కాలేదు.. 

దేశంలోని పలు రాష్ట్రాలను ప్రతిపక్షాలు పాలిస్తున్నాయని, మోదీ ఇంకా చక్రవర్తి కాలేదని ఖర్గే వ్యాఖ్యానించారు. అహ్మదాబాద్‌ కార్యక్రమంలో బ్రిటిష్‌ టోపీ ధరించి రాజులా చుట్టుపక్కల ముఖ్యమంత్రులు, మంత్రులు ఎవరూ లేకుండా మోదీ ఒక్కరే కూర్చున్నారని ఆయన ఎద్దేవాచేశారు. ‘‘రాజు అంటే ప్రతి రాష్ట్రాన్ని శాసించాలి. కానీ తమిళనాడు, కేరళ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, తెలంగాణ సహా పలు రాష్ట్రాలను ప్రతిపక్షాలు పాలిస్తున్నాయి. మెజారిటీ కూడా లేని మోదీ- నీతీశ్‌ కుమార్, చంద్రబాబు నాయుడు వంటి పలు నేతల సహాయంతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు’’ అని ఖర్గే వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  

రాహుల్‌ సహా పలువురు కాంగ్రెస్‌ నేతల నివాళి

మరోవైపు, 150వ జయంతి సందర్భంగా వల్లభ్‌భాయ్‌ పటేల్‌కు నివాళులు అర్పిస్తూ ఖర్గే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ప్రాథమిక హక్కులపై పటేల్‌ ఆమోదించిన తీర్మానాలు భారత రాజ్యాంగానికి ఆత్మగా నిలిచాయని గుర్తుచేసుకున్నారు. రాహుల్‌ గాంధీ కూడా పటేల్‌కు నివాళులు అర్పించారు. దేశాన్ని ఏకంచేసిన పటేల్‌ ఐక్యత, సమగ్రతకు బలమైన పునాది వేశారని రాహుల్‌ గాంధీ అన్నారు.

Tags :
Published : 01 Nov 2025 04:59 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని