Heatwave: వామ్మో..! 56 డిగ్రీలా..? నాగ్‌పుర్‌లో భానుడి విశ్వరూపం

Heatwave: వేసవి తీవ్రతతో నాగ్‌పుర్‌ అల్లాడిపోతోంది. తాజాగా అక్కడ అత్యధికంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Published : 31 May 2024 15:43 IST

నాగ్‌పుర్‌: దేశవ్యాప్తంగా ఎండలు (Heatwave) మండుతున్నాయి. రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మొన్నటికి మొన్న దేశ రాజధాని దిల్లీలో అత్యధికంగా 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. ఆ ఉష్ణోగ్రతను దాటి ఇప్పుడు మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ (Nagpur)లో ఏకంగా 56 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

నాగ్‌పుర్‌లో భారత వాతావరణ విభాగం నాలుగు ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్స్‌ (AWS)ను ఏర్పాటుచేసింది. ఇందులో రెండింట గురువారం అసాధారణ ఉష్ణోగ్రతలు (Highest Temperature) చూపించాయి. సోనేగావ్‌లోని ఏడబ్ల్యూఎస్‌ స్టేషన్‌లో 54 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా.. ఉత్తర అంబాజరీ రోడ్డులోని ఐఎండీ కేంద్రంలో రికార్డు స్థాయిలో 56 డిగ్రీలు నమోదైంది. మిగతా రెండు స్టేషన్లలో 44 డిగ్రీల ఎండలు ఉన్నట్లు రికార్డయ్యింది.

ఇటీవల దిల్లీ (Delhi News)లోని ముంగేష్‌పుర్‌లో 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన సంగతి తెలిసిందే. దిల్లీ చరిత్రలో ఇదే అత్యధికం కావడంతో వాతావరణ శాఖ (IMD) స్పందిందించి. ఆ వాతావరణ స్టేషన్‌లోని సెన్సార్‌ సరిగా పనిచేస్తుందో, లేదో తనిఖీ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామాల వేళ ఇప్పుడు నాగ్‌పుర్‌లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవడం మరోసారి చర్చకు దారితీసింది. ఇక్కడా సెన్సార్‌ పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.

అగ్నిప్రమాదాల నిలయంగా దిల్లీ

ఉసురుతీస్తున్న వడదెబ్బ.. 54 మంది మృతి

మరోవైపు తీవ్రమైన ఎండలు, వడగాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఇప్పటికే వడదెబ్బ (Sunstroke) కారణంగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 54 మంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధికంగా బిహార్‌లో 32 మంది మృతి చెందగా.. ఒడిశాలో 10, ఝార్ఖండ్‌లో 5, రాజస్థాన్‌లో ఐదుగురు, ఉత్తరప్రదేశ్‌లో ఒకరు, దిల్లీలో ఒకరు మరణించారు. రానున్న రెండు రోజుల్లో యూపీ, దిల్లీ, చండీగఢ్‌, హరియాణాలోని పలు ప్రాంతాల్లో దుమ్ము తుపాను వచ్చే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. వడగాలులు తీవ్రంగా ఉన్నందున దేశంలో జాతీయ ఎమర్జెన్సీని విధించే అవకాశాలను పరిశీలించాలని రాజస్థాన్‌ హైకోర్టు కేంద్రానికి సూచించింది.

రుతుపవనాల పైనే ఆశ..

మరోవైపు, దేశంలోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) ప్రవేశించడం కాస్త ఊరటనిచ్చే విషయం. గురువారం కేరళ తీరాన్ని తాకిన ఈ రుతుపవనాలు.. ప్రస్తుతం దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో ఇవి మిగతా ప్రాంతాలకు విస్తరించే అవకాశముంది. దీంతో శనివారం నుంచి వడగాలుల తీవ్రత కాస్త తగ్గొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని