New Cabinet: కేబినెట్‌లో పాతకొత్తల మేలు కలయిక

1951 జులై 10వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా భభౌరాలో రైతు కుటుంబంలో జన్మించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ పీజీలో భౌతిక శాస్త్రం చదివారు. తొలినాళ్లలో లెక్చరర్‌గా పని చేశారు. 1964లో 13ఏళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు.

Updated : 10 Jun 2024 10:54 IST

మోదీ అనే నేను..


రాజ్‌నాథ్‌ సింగ్‌
వయసు 72

1951 జులై 10వ తేదీన ఉత్తర్‌ప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా భభౌరాలో రైతు కుటుంబంలో జన్మించిన రాజ్‌నాథ్‌ సింగ్‌ పీజీలో భౌతిక శాస్త్రం చదివారు. తొలినాళ్లలో లెక్చరర్‌గా పని చేశారు. 1964లో 13ఏళ్ల వయసులో ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. 1974లో భారతీయ జనసంఘ్‌లో చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగారు. 2005 నుంచి 2009 దాకా, మళ్లీ 2013 నుంచి 2014 దాకా భాజపా అధ్యక్షుడిగా సేవలందించారు. 2000 నుంచి 2002 దాకా ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 నుంచి 2024 వరకూ కేంద్ర హోం మంత్రిగా, రక్షణ మంత్రిగా పని చేశారు. ఈ ఎన్నికల్లో లఖ్‌నవూ నుంచి 1.35 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.


అమిత్‌ షా
వయసు 59

మోదీకి అత్యంత విశ్వాసపాత్రుడైన అమిత్‌ అనిల్‌ చంద్ర షా 1964 అక్టోబరు 22వ తేదీన ముంబయిలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గుజరాత్‌లోని మన్సాకు చెందినవారు. సాహసోపేత, అసాధారణ నాయకత్వ లక్షణాలతో కార్యకర్త స్థాయి నుంచి దేశంలోనే కీలక స్థాయి నేతగా అమిత్‌ షా ఎదిగారు. 1980లలో ఏబీవీపీలో చేరి విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. బయో కెమిస్ట్రీ చదివారు. 2014 నుంచి 2020 వరకూ భాజపా అధ్యక్షుడిగా పని చేశారు. ఆయన హయాంలోనే పార్టీ 2 సార్లు (2014, 2019) అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో గుజరాత్‌లోని గాంధీనగర్‌ నుంచి 7,44,716 ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయం సాధించారు. భాజపా ప్రభుత్వం తీసుకునే కీలక విధాన నిర్ణయాల్లో అమిత్‌ షాదే ముఖ్య పాత్ర. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వ సవరణ చట్టం వంటి వాటిలో అమిత్‌ షా కీలకంగా వ్యవహరించారు. 2019 నుంచి 2024 వరకూ కేంద్ర హోం మంత్రిగా పని చేసిన ఆయన మరోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.


నితిన్‌ గడ్కరీ
67

1957 మే 27న నాగ్‌పుర్‌లో మరాఠీ కుటుంబంలో నితిన్‌ జయరాం గడ్కరీ జన్మించారు. గడ్కరీ మోదీ కేబినెట్‌లో కీలక సీనియర్‌ మంత్రి. తొలినాళ్లలో ఏబీవీపీ, భాజపా యువమోర్చాల్లో పని చేశారు. కామర్స్‌లో పీజీతోపాటు లా కోర్సు చదివారు. గడ్కరీ సంఘ్‌కు అత్యంత ఇష్టుడు. 2009 నుంచి 2013 వరకూ భాజపా అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ పదవిని చేపట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా గుర్తింపు పొందారు. జాతీయ రహదారుల మంత్రిగా రోడ్ల నిర్మాణంలో రికార్డు సృష్టించారు. నాగ్‌పుర్‌ నుంచి మూడోసారి ఎంపీగా గెలిచారు. ‘ఎక్స్‌ప్రెస్‌ వే మ్యాన్‌’గా గడ్కరీకి గుర్తింపు వచ్చింది. ఈసారి ఆయనకు 1.37లక్షల మెజారిటీ వచ్చింది.


జేపీ నడ్డా
63

బిహార్‌లోని పట్నాలో 1960 డిసెంబరు 2వ తేదీన జన్మించిన జగత్‌ ప్రకాశ్‌ నడ్డా 2020 నుంచి భాజపా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పూర్వీకులది హిమాచల్‌ ప్రదేశ్‌. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. ఏబీవీపీతో కెరీర్‌ను ప్రారంభించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తోనూ అనుబంధం కొనసాగించారు. భారతీయ జనతా యువ మోర్చా నేతగా పని చేశారు. 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. 


శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌
64

మధ్యప్రదేశ్‌లోని జైత్‌ గ్రామంలో 1959 మార్చి 5వ తేదీన జన్మించిన శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ 13ఏళ్ల వయసులోనే ఆర్‌ఎస్‌ఎస్‌తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఎమర్జెన్సీ సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లి పోరాడారు. ఆ తర్వాత జైలు పాలయ్యారు. ఎంఫిల్‌ చదివారు. 1990లో తొలిసారిగా భాజపా ఎంపీగా ఎన్నికయ్యారు. 18ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ ఎన్నికల్లో 8.21 లక్షల భారీ మెజారిటీతో విదిశ నుంచి విజయం సాధించారు. శివరాజ్‌ తొలిసారిగా కేంద్ర కేబినెట్‌ మంత్రి అయ్యారు. 


మనోహర్‌లాల్‌ ఖట్టర్‌
69

1954 మే 5వ తేదీన జన్మించిన మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ కుటుంబం విభజనానంతరం పాకిస్థాన్‌ నుంచి హరియాణాలోని నిందానాకు వచ్చి స్థిరపడింది. అక్కడే ఆయన పుట్టారు. ఖట్టర్‌ దాదాపు తొమ్మిదేళ్లపాటు హరియాణాకు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1977 నుంచి 17ఏళ్ల పాటు ఆర్‌ఎస్‌ఎస్‌లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు. 1994లో భాజపాలో చేరారు. అవివాహితుడు. ఈసారి కర్నాల్‌ నుంచి పోటీ చేసి 2.35లక్షల మెజారిటీతో గెలిచారు. మోదీకి అత్యంత సన్నిహితుడు. 


కుమారస్వామి
64

1959 డిసెంబరు 16వ తేదీన జన్మించిన హరదనహళ్లి దేవెగౌడ కుమారస్వామి రెండు సార్లు కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు. వక్కలిగ వర్గానికి చెందిన ఆయన హరదనహళ్లిలో జన్మించారు. బీఎస్సీ చదివారు. ఆయన తండ్రి మాజీ ప్రధాని దేవెగౌడ. లోక్‌సభ ఎన్నికలకు ముందు భాజపాతో పొత్తు పెట్టుకుని మండ్య నుంచి 2,84,620 ఓట్ల మెజారిటీతో గెలిచారు. సినీ నిర్మాణ రంగంలోనూ పని చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తొలిసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపడుతున్నారు.


ధర్మేంద్ర ప్రధాన్‌
54

1969 జూన్‌ 26వ తేదీన ఒడిశాలోని తాల్చేర్‌లో జన్మించిన ధర్మేంద్ర ప్రధాన్‌ మాజీ కేంద్ర మంత్రి దేవేంద్ర ప్రధాన్‌ తనయుడు. 1983లో ఏబీవీపీతో తన రాజకీయ జీవితాన్ని ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రారంభించారు. ఆయన రాజకీయ శాస్త్రంలో ఎంఏ చేశారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన 15ఏళ్ల తర్వాత సంబల్‌పుర్‌ నుంచి 1.19 లక్షల మెజారిటీతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మూడోసారి కేబినెట్‌ మంత్రి అయ్యారు. సుదీర్ఘకాలం పెట్రోలియం శాఖ మంత్రిగా పనిచేయడంతో ఆయనకు ‘ఉజ్వల మ్యాన్‌’గా పేరు వచ్చింది.  


జ్యోతిరాదిత్య సింధియా
52

1971 జనవరి 1వ తేదీన ముంబయిలో జన్మించిన జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్‌ రాజవంశానికి చెందినవారు. హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్‌ వర్సిటీల్లో చదివారు. 2002లో తన తండ్రి మాధవరావ్‌ సింధియా విమాన ప్రమాదంలో మరణించడంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఎన్నో ఏళ్ల కాంగ్రెస్‌ బంధాన్ని తెంచుకుని ఆయన భాజపాలో చేరి మంత్రి అయ్యారు. గుణ నుంచి ఇటీవల 5,40,929 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మరోసారి మంత్రిగా ప్రమాణం చేశారు. 


జీతన్‌ రామ్‌ మాంఝీ
80

రాజకీయ వ్యూహ చతురతలో దిట్ట. కాంగ్రెస్‌ (1980-1990), జనతాదళ్‌ (1990-1996), ఆర్జేడీ (1996-2005), జేడీయూ(2005-2015)లలో కొనసాగారు. ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించిన నీతీశ్‌కుమార్‌కే ఎదురుతిరగడంతో 2015లో ఆ పదవిని కోల్పోయారు. జేడీయూ నుంచి బయటకు వచ్చి 2015లో సొంతగా హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌)ను స్థాపించారు. కొన్నాళ్లు మహాగఠ్‌బంధన్‌తో, మరికొన్నాళ్లు ఎన్డీయేతో జట్టు కట్టారు. ఎదురుదెబ్బలకు బెదరని స్వభావం ఈ బిహారీ దళిత నేత సొంతం. గయ లోక్‌సభ స్థానం నుంచి మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. నాటకీయమైన ఎన్నో రాజకీయ మలుపుల తర్వాత ఎన్డీయేతో కొనసాగుతూ తాజాగా కేంద్ర మంత్రి పదవిని పొందారు.


గిరిరాజ్‌ సింగ్‌
72

బిహార్‌కు చెందిన భాజపా సీనియర్‌ ఎంపీ గిరిరాజ్‌ సింగ్‌ కొద్దికాలంలోనే పార్టీలో బలమైన నేతగా ఎదిగారు. 2014లో నవాడాలో నెగ్గి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టిన ఆయన.. అదే ఏడాది సూక్ష్మ, చిన్న మధ్యతరగతి పరిశ్రమల శాఖకు సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2017లో స్వతంత్ర హోదా పొంది మరో మెట్టు ఎక్కారు. 2019, 2024లో బెగుసరాయి నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019లో కేంద్ర పశుసంవర్ధక శాఖకు కేబినెట్‌ హోదాలో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2021లో మార్పులు చేర్పుల్లో భాగంగా కీలకమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ శాఖ పగ్గాలు అందుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే ఈయన.. అంతకుముందు 2005 నుంచి 2013 మధ్య రాష్ట్ర మంత్రిగా పనిచేశారు.


గజేంద్ర సింగ్‌ షెకావత్‌
56

రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌ నుంచి వరుసగా మూడో దఫా లోక్‌సభకు ఎన్నికైన గజేంద్ర సింగ్‌ షెకావత్‌ను మరోసారి కేంద్ర మంత్రి పదవి వరించింది. 2017లో కేంద్ర సహాయ మంత్రి పదవిని చేపట్టారు. 2019లో కేబినెట్‌ మంత్రిగా నియమితులై జలశక్తి శాఖను పర్యవేక్షించారు. బ్లూసిటీగా ప్రసిద్ధి పొందిన జోధ్‌పుర్‌లో పౌరవిమానాశ్రయాన్ని షెకావత్‌ అభివృద్ధి పరిచారు. ఎయిమ్స్‌ను విస్తరించారు. 1980 నుంచి షెకావత్‌ అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యార్థి దశలో ఏబీవీపీ నాయకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత భాజపా కిసాన్‌ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ కో-కన్వీనర్‌గానూ నియమితులయ్యారు.


పీయూష్‌ గోయల్‌
59

1964 జూన్‌ 13న ముంబయిలో జన్మించిన పీయూష్‌ గోయల్‌ తొలిసారిగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇప్పటిదాకా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉండి కేంద్ర మంత్రిగా పని చేశారు. చార్టర్డ్‌ ఎకౌంటెంట్‌గా ప్రాక్టీస్‌ చేసిన ఆయన తండ్రి వేద్‌ ప్రకాశ్‌ గోయల్‌ అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చారు. ఇన్‌వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్‌గానూ పని చేశారు. ఉత్తర ముంబయి నుంచి 3,57,608 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2017 నుంచి కేబినెట్‌ మంత్రిగా పని చేస్తున్నారు. 


అశ్వినీ వైష్ణవ్‌
53

1970 జులై 18వ తేదీన రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో జన్మించిన అశ్వినీ వైష్ణవ్‌ ఐఐటీ కాన్పుర్‌లో చదివారు. ఆ తరవాత ఐఏఎస్‌కు ఎంపికై ఒడిశా కేడర్‌లో పని చేశారు. రైల్వే మంత్రిగా ఆయన అనేక సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. మరోసారి కేంద్ర కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు. వాజ్‌పేయీ హయాంలో పీఎంవోలో పని చేసినప్పుడు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య ప్రాజెక్టులను చేపట్టడంలో కీలకపాత్ర పోషించారు. 2019 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.


భూపేంద్ర యాదవ్‌
54

రాజస్థాన్‌లోని అల్వార్‌ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు 2012 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండో సారి. అగ్రనేతలు మోదీ, అమిత్‌ షా ఇద్దరికీ అత్యంత సన్నిహితుడు. వృత్తి రీత్యా న్యాయవాది. ఎన్నికల వ్యూహరచనలో నిష్ణాతుడు. మధ్యప్రదేశ్, ఒడిశా, గుజరాత్, ఝార్ఖండ్‌లలో భాజపా విజయం వెనుక కీలకమైన వ్యక్తి. పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా కొనసాగారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు.


రాజీవ్‌ రంజన్‌(లలన్‌) సింగ్‌
69

జేడీయూ ఛైర్‌పర్సన్, బిహార్‌ ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్‌కు చాలా కాలంగా అత్యంత సన్నిహితమైన వ్యక్తి రాజీవ్‌ రంజన్‌ అలియాస్‌ లలన్‌ సింగ్‌. ఈ భూమిహార్‌ నేత నీతీశ్‌కు కుడి భుజంలాంటి వారు. 2022లో జేడీయూ-ఆర్జేడీ మధ్య పొత్తు కుదర్చడంలో కీలకంగా వ్యవహరించారు. నీతీశ్‌తో ఒకానొక దశలో విభేదాలు తలెత్తినా సర్దుబాటు చేసుకున్నారు. ముంగర్‌ లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి (2009, 2019,2024) ఎన్నికయ్యారు. అంతకు ముందు 2004లో బెగుసరై నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 2014లో ఓడిపోవడంతో లలన్‌ సింగ్‌ను నీతీశ్‌ రాజ్యసభకు నామినేట్‌ చేశారు. దీనిపై విభేదించిన జ్ఞానేంద్ర సింగ్‌ తిరుగుబాటు జెండా ఎగురవేసి ఆ తర్వాత 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి భాజపాలో చేరారు.


సీఆర్‌ పాటిల్‌
69

భాజపా గుజరాత్‌ రాష్ట్ర అధ్యక్షుడైన సీఆర్‌ పాటిల్‌ తొలిసారి కేంద్ర మంత్రివర్గంలో భాగస్వాములయ్యారు. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం అందించడంలో కీలకంగా నిలిచారు. ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ ఓట్లలోనూ ఆయనది రికార్డే. 14 ఏళ్లపాటు చేసిన కానిస్టేబుల్‌ ఉద్యోగానికి 1984లో రాజీనామా చేశారు. 1989లో భాజపాలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 1995లో మోదీకి దగ్గరై.. జనరల్‌ సెక్రటరీ అయ్యారు. 2009 నుంచి నవ్సారీ ఎంపీగా బంపర్‌ మెజారిటీతో గెలుస్తున్నారు. 2020లో పార్టీ రాష్ట్ర బాధ్యతలు చేపట్టగా.. ఎంపీగా పలు కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతుంటారనీ, ఆపద సమయాల్లో వెంటనే స్పందిస్తామని ఆయనకు పేరు. కొవిడ్‌ వ్యాప్తి సమయంలో రెమెడెసివీర్‌ ఇంజెక్షన్లను ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించి వార్తల్లో నిలిచారు. 


వీరేంద్ర కుమార్‌
70

1954 ఫిబ్రవరి 27న మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో జన్మించిన దళిత నేత వీరేంద్ర కుమార్‌ 8సార్లు ఎంపీగా గెలిచారు. టికంగఢ్‌ నుంచి వరుసగా నాలుగుసార్లు విజయం సాధించారు. ఆయన తండ్రి సాగర్‌లో సైకిళ్లకు పంచర్లు వేసే దుకాణం నిర్వహించేవారు. వీరేంద్ర కుమార్‌ బాల కార్మిక వ్యవస్థపై పీహెచ్‌డీ చేశారు. 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన 

ఇప్పటికీ అప్పుడప్పుడు స్కూటర్‌పై తిరుగుతుంటారు.


హర్దీప్‌సింగ్‌ పురీ
72

1952 ఫిబ్రవరి 15వ తేదీన దిల్లీలో జన్మించిన హర్దీప్‌సింగ్‌ పురీ (72) మాజీ దౌత్యవేత్త. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌ మాజీ అధికారి అయిన ఆయన విద్యార్థి దశ నుంచే తనకు ఏబీవీపీతో అనుబంధం ఉందని చెబుతారు. దిల్లీలోని హిందూ కళాశాలలో చరిత్రలో పీజీ చదివారు. పదవీ విరమణ చేశాక 2014లో భాజపాలో చేరారు. 2017 నుంచి మంత్రిగా కొనసాగుతున్నారు. పార్లమెంటు భవన నిర్మాణంలో కీలకపాత్ర పోషించారు. వివిధ దేశాల రాయబారిగా, ఐక్యరాజ్య సమితిలో భారత ప్రతినిధిగా సేవలందించారు.


కిరణ్‌ రిజిజు
53

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నఖు గ్రామంలో 1971 నవంబరు 19వ తేదీన జన్మించిన కిరణ్‌ రిజిజు న్యాయ శాస్త్రంలో పట్టా పొందారు. ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కూడా. 2004లో తొలిసారిగా లోక్‌సభలో అడుగుపెట్టారు. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న ఆయన భాజపాలోకి వచ్చాక దశ తిరిగింది. గతంలో న్యాయశాఖ మంత్రిగా పని చేసిన సమయంలో పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. మరోసారి ఆయనను మంత్రి పదవి వరించింది. 


మన్‌సుఖ్‌ మాండవీయ
52

1972 జూన్‌ 1న గుజరాత్‌లోని భావ్‌నగర్‌లో జన్మించిన మన్‌సుఖ్‌ మాండవీయ కరోనా సమయంలో ఆరోగ్య మంత్రిగా సమర్థంగా వ్యవహరించారు. రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఆయన ఈసారి పోర్‌బందర్‌ నుంచి లోక్‌సభకు 3.83 లక్షల ఓట్ల మెజారిటీతో ఎన్నికయ్యారు. రాజకీయ శాస్త్రంలో పీజీ చేశారు. వెటర్నరీ సైన్సు కూడా చదివారు. పీహెచ్‌డీ పట్టా సాధించారు. ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో ఆయనకు అనుబంధం ఉంది. 2002లో అతి పిన్న వయసులో ఆయన గుజరాత్‌ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 


నిర్మలా సీతారామన్‌
64

1959 ఆగస్టు 18వ తేదీన తమిళనాడులోని మదురై అయ్యంగార్‌ కుటుంబంలో నిర్మలా సీతారామన్‌ జన్మించారు. ఆర్థిక శాస్త్రంలో ఆమె ఎంఫిల్‌ చేశారు. పీహెచ్‌డీలో చేరినా పూర్తి చేయలేకపోయారు. 2003 నుంచి 2005దాకా ఆమె జాతీయ మహిళా కమిషన్‌ సభ్యురాలిగా పని చేశారు. 2008లో భాజపాలో చేరారు. 2014 వరకూ పార్టీ అధికార ప్రతినిధిగా సేవలందించారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రక్షణ, ఆర్థిక మంత్రిగా సేవలందించారు. 2022లో ఫోర్బ్స్‌ ప్రకటించిన 100 మంది శక్తిమంతులైన మహిళల్లో ఒకరిగా నిలిచారు.


ఎస్‌ జైశంకర్‌
69

1955 జనవరి 9వ తేదీన దిల్లీలో జన్మించిన ఎస్‌ జైశంకర్‌ 2019 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన తమిళ హిందూ కుటుంబానికి చెందినవారు. ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌(ఐఎఫ్‌ఎస్‌)కు చెందిన ఆయన పలు దేశాల్లో దౌత్యవేత్తగా సేవలందించారు. ఐఎఫ్‌ఎస్‌కు చెందిన వారిలో నట్వర్‌సింగ్‌ తర్వాత విదేశాంగ మంత్రిగా నియమితులైన రెండో వ్యక్తిగా జైశంకర్‌ నిలిచారు. అణు దౌత్యంలో ఆయనది అందెవేసిన చేయి.


జుయెల్‌ ఓరం
62

1961 మార్చి 22న ఒడిశాలోని సుందర్‌గఢ్‌లో జన్మించిన జుయెల్‌ ఓరం ఆ ప్రాంతంలో గట్టి పట్టున్న గిరిజన నేత. ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా చేశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో తొలిసారిగా ఏర్పాటు చేసిన కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖకు మొట్టమొదటి మంత్రిగా వ్యవహరించారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా అపార అనుభవం కలిగిన ఆయన సుందర్‌గఢ్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 6 సార్లు గెలుపొందారు.


ప్రహ్లాద్‌ జోషి
61

1962 నవంబరు 27న కర్ణాటకలోని విజాపురలో  జన్మించిన ప్రహ్లాద్‌ జోషి ధార్వాడ నుంచి వరుసగా ఐదోసారి గెలిచారు. మూడోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘకాలంగా ఆర్‌ఎస్‌ఎస్‌ వాదిగా, భాజపా నేతగా ఉన్నారు. మోదీ, అమిత్‌ షాలకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో, చెస్‌లో, బ్యాడ్మింటన్, క్యారమ్స్‌లో ఆయనకు ప్రావీణ్యముంది. డిగ్రీ చదివారు. పారిశ్రామికవేత్తగానూ రాణిస్తున్నారు.


సర్బానంద సోనోవాల్‌
61

అస్సాంలోని దిబ్రూగఢ్‌ జిల్లా ములుక్‌గావ్‌లో 1962 అక్టోబరు 31వ తేదీన జన్మించిన సర్బానంద సోనోవాల్‌ అవివాహితుడు. అస్సాంలోని శంకరదేవ, మాధవదేవ సాధువుల అనుచరుడిగా కొనసాగుతున్నారు. విద్యార్థి నాయకుడిగా జీవితాన్ని ప్రారంభించి అస్సాం ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా ఎదిగారు. న్యాయశాస్త్రంలో డిగ్రీ చేసిన ఆయన రాజ్యసభ ఎంపీగా ఉన్నారు.


చిరాగ్‌ పాస్వాన్‌
42

తండ్రి రామ్‌ విలాస్‌ పాస్వాన్‌ రాజకీయ వారసత్వాన్ని అందుకునే క్రమంలో ఆటుపోటులను ఎదుర్కొని విజేతగా నిలిచిన వ్యక్తి చిరాగ్‌ పాసవాన్‌. 2021లో లోక్‌జనశక్తి పార్టీని బాబాయి పశుపతి కుమార్‌ పరాస్‌ సొంతం చేసుకోవడంతో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్న చిరాగ్‌... అనతి కాలంలోనే తానేమిటో నిరూపించుకున్నారు. ప్రస్తుతం ప్రధాని మోదీ కేబినెట్‌లో స్థానం దక్కించుకున్నారు.


అన్నపూర్ణాదేవి
54

అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన అన్నపూర్ణాదేవి రెండోసారి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఝార్ఖండ్‌లోని కొడెర్మా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. రాంచీ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్‌ పూర్తి చేశారు. 2021లో కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అనేక నాటకీయతల మధ్య 2019లో భాజపాలో చేరిన ఆమె.. రాజకీయ ఉద్ధండుడు బాబూలాల్‌ మరాండీని ఓడించి సంచలనం సృష్టించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని