Nitish Kumar: అప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి.. తేజస్వీ యాదవ్‌పై నీతీశ్‌ ఫైర్‌

Eenadu icon
By National News Team Updated : 23 Jul 2025 14:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: బిహార్‌ (Bihar)లో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈక్రమంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. తాజాగా బుధవారం అసెంబ్లీలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌(Tejashwi Yadav) ఎస్‌ఐఆర్‌పై చర్చిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) కలుగజేసుకొని ఆర్జేడీపై విమర్శలు చేశారు. 

‘ అప్పుడు నువ్వు చిన్నపిల్లాడివి. మీ తల్లిదండ్రులు చెరో ఏడేళ్లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అప్పటి పరిస్థితులు మీకు తెలుసా? అప్పట్లో రాత్రయితే అడుగు బయటపెట్టలేని పరిస్థితి ఉండేది. అప్పుడు నేనూ మీతో ఉన్నాను. కానీ, మీ పద్ధతి సరిగా లేదు కాబట్టే నేను భాజపాతో చేతులు కలిపా. మేము (భాజపా, జేడీయూ) ఇప్పుడు కలిసే ఉన్నాం. అలాగే ఉంటాం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఏం చేయాలో ప్రజలకు తెలుసు’ అని నితీశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం మద్దతిస్తుందన్నారు. మహిళల కోసం, మైనారిటీల కోసం ఆర్జేడీ ఏం చేసిందని ప్రశ్నించారు. తాము అన్నివర్గాల అభివృద్ధికి పని చేస్తున్నామన్నారు. 

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు వ్యతిరేకం కాదు..

ఇక, అసెంబ్లీలో తేజస్వీయాదవ్ మాట్లాడుతూ.. తాము ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకం కాదని, కానీ ఆ ప్రక్రియ పారదర్శకంగా జరగడం లేదని పేర్కొన్నారు. ‘బయట నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడి ఓటర్లుగా మారారని తమకు ఫిర్యాదులు అందాయని ఈసీ చెబుతుంది. 2003లో ఈ ప్రక్రియ చేపట్టారు. ఆ తర్వాత చాలా ఎన్నికలు జరిగాయి. అప్పుడే ఈ ప్రక్రియ ఎందుకు చేయలేదు. అయితే, నకిలీ ఓట్లతో నీతీశ్ ముఖ్యమంత్రి అయ్యారా?. మనం నకిలీ ఓట్లతో గెలిచి ఇక్కడికి వచ్చామా?’ అని ఆర్జేడీ నేత ప్రశ్నించారు.

ఇదిలాఉంటే.. ఈ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సమర్థించింది. అయితే, ప్రాథమిక పత్రాలుగా ఆధార్‌, రేషన్‌కార్డుతో పాటు స్వయంగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఐడీ కార్డును పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఈసీని అనుమానించడానికి ఏమీ లేదని, ఈ అంశంపై మరింత విచారణ జరగాల్సి ఉందని వ్యాఖ్యానించింది.

Tags :
Published : 23 Jul 2025 14:08 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    సుఖీభవ

    చదువు