Kejriwal: దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట

తన అరెస్టును సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఉపశమనం లభించలేదు.

Updated : 28 Mar 2024 16:13 IST

దిల్లీ: మద్యం విధానం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు దిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన వేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం (Delhi High court).. ఆయనకు మధ్యంతర ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇరువర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాడీవేడిగా వాదనలు కొనసాగాయి. అలాగే, కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్‌ 2 లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 3కు వాయిదా వేసింది. ఈడీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు, కేజ్రీవాల్‌ తరఫున అభిషేక్‌ సింఘ్వీ వాదనలు వినిపించారు.

పిటిషన్‌పై వాడీవేడిగా వాదనలు!

ఈడీ తనను అరెస్టు చేయడం ద్వారా మానవ హక్కుల్ని ఉల్లంఘించిందని కేజ్రీవాల్‌ పిటిషన్‌లో పేర్కొన్నారు. నేరాన్ని నిర్ధారించడంలో ఈడీ విఫలమైందన్న ఆయన.. విచారణ లేకుండా అరెస్టు చేయడం రాజకీయ ప్రేరేపితంగా కనిపిస్తోందని తెలిపారు. వెంటనే జైలు నుంచి విడుదల చేసి తనకు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌ విచారణ నేపథ్యంలో ఏఎస్‌జీ ఎస్వీరాజు స్పందిస్తూ పిటిషన్‌కు సంబంధించిన దస్త్రం తమకు నిన్ననే అందిందని.. అందువల్ల దీనిపై స్పందించేందుకు మూడు వారాల సమయం కావాలని కోరారు. దీన్ని సింఘ్వీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈడీ అధికారులు ఆలస్యం చేసే వ్యూహాలను పన్నుతున్నారని ఆరోపించారు. మూడు వారాల గడువు అడగడం దారుణమని.. ఒక సిట్టింగ్‌ సీఎంను అరెస్టు చేసిన వారి ఉద్దేశమే భిన్నంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి అంతరాయం కలిగించేందుకే కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారన్న ఆప్‌ వాదనను సింఘ్వీ కోర్టు ముందుంచారు. 

మద్యం విధానం కేసులో ఈనెల 21న రాత్రి కేజ్రీవాల్‌ అరెస్టు కాగా.. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలో ఉన్నారు. ఈనెల 28న మధ్యాహ్నంతో ఈడీ కస్టడీ ముగినుండటంతో ఆయన్ను గురువారం రౌస్‌ అవెన్యూకోర్టులో హాజరుపరచనున్నారు. అయితే, ఈడీ అధికారులు ఆయనను మరికొన్ని రోజుల పాటు తమ కస్టడీకి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని