Angelo Mathews: మాథ్యూస్‌ ‘టైమ్డ్‌ ఔట్‌’.. వైరల్‌ అవుతున్న రోడ్‌ సేఫ్టీ యాడ్‌

రహదారి భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఒడిశా రవాణా సంస్థ చేసిన ఓ ప్రయత్నం నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ యాడ్‌ కోసం శ్రీలంక ఆటగాడు మాథ్యూస్‌ (Angelo Mathews) ‘టైమ్డ్‌ ఔట్‌’ సంఘటనను ఉపయోగించుకోవడమే అందుక్కారణం.

Published : 08 Nov 2023 16:13 IST

భువనేశ్వర్‌: వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023)లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక బ్యాటర్‌ ఏంజెలో మాథ్యూస్‌ (Angelo Mathews)ను ‘టైమ్డ్‌ ఔట్‌ (Timed-out)’గా ప్రకటించడం తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఒడిశా రాష్ట్ర రవాణా సంస్థ (Odisha State Transport Authority) కాస్త క్రియేటివ్‌గా ఆలోచించింది. మాథ్యూస్‌ ‘టైమ్డ్‌ ఔట్‌’ సంఘటనను.. రోడ్‌ సేఫ్టీ (Road Safety)కి ముడిపెడుతూ అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. బైక్‌పై వెళ్లేప్పుడు నాణ్యమైన హెల్మెట్‌ ధరించాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది.

గత సోమవారం జరిగిన మ్యాచ్‌లో హెల్మెట్‌ (Helmet) పట్టీ తెగిపోయిన కారణంగా మాథ్యూస్‌ క్రీజులోకి ఆలస్యంగా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో నిర్ణీత గడువులోగా బంతిని ఎదుర్కోని కారణంగా అతడిని ‘టైమ్డ్‌ ఔట్‌’గా ప్రకటించారు. బంగ్లా జట్టుతో పాటు అంపైర్‌తో వాదించినా ఫలితం లేకపోవడంతో మాథ్యూస్‌ అసహనంగా పెవిలియన్‌కు తిరిగెళ్లాడు.

అలా పట్టీ తెగిపోయిన హెల్మెట్‌ పట్టుకుని మాథ్యూస్‌ మైదానాన్ని వీడుతున్న ఫొటోలను ఒడిశా రాష్ట్ర రవాణా సంస్థ తమ సోషల్‌ మీడియా ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘ఆన్‌ ఫీల్డ్‌ లేదా ఆఫ్‌ ఫీల్డ్‌.. నాణ్యత లేని హెల్మెట్‌లు మీ వికెట్‌ తీసుకుంటాయి’’ అని ఈ ఫొటోలకు జత చేసి రహదారి భద్రతపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది.

‘‘ప్రపంచకప్‌ నుంచి రోడ్‌ సేఫ్టీపై నేర్చుకోవాల్సిన పాఠం. వికెట్‌ను (ప్రాణాన్ని ఉద్దేశిస్తూ) పోగొట్టుకోకండి. సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు ఆడండి. ఎల్లప్పుడూ ఐఎస్‌ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లనే ధరించండి. పట్టీని జాగ్రత్తగా పెట్టుకోండి. ఇక, బైక్‌పై వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్‌ ధరిస్తే మంచిది. ఆన్‌ ఫీల్డ్ అయినా ఆఫ్‌ ఫీల్డ్‌ అయినా.. మన భద్రతే ప్రధానం’’ అని రాష్ట్ర రవాణా సంస్థ తమ పోస్ట్‌లో రాసుకొచ్చింది.

ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. ఒడిశా రవాణా సంస్థ క్రియేటివిటీని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కాగా.. గతంలోనూ రాష్ట్ర రవాణా సంస్థ ఇలా సృజనాత్మకతను జోడించి.. ‘బాహుబలి’, ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా పోస్టర్లతో రోడ్‌ సేఫ్టీపై అవగాహన కల్పించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని