పహల్గాం ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు

Eenadu icon
By National News Team Published : 31 Oct 2025 16:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏక్తా దివస్‌ను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా వివిధ ఆపరేషన్లు, దర్యాప్తు, ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 1466 మంది పోలీసులకు కేంద్ర హోంశాఖ అత్యుత్తమ పురస్కారాలు ప్రకటించింది. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని పోలీసులు సహా కేంద్ర బలగాలను ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌ 2025’కు ఎంపిక చేశారు. వీరిలో పహల్గాం ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో పాల్గొన్న 40 మంది జమ్మూ కశ్మీర్‌ పోలీసులు, సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కూడా ఉన్నారు.

పహల్గాం దాడికి తెగబడిన ఉగ్రవాదులను ఏరివేసేందుకు భారత సైన్యం, జమ్మూ పోలీసులు, ఇతర భద్రతా దళాలు సంయుక్తంగా ‘ఆపరేషన్‌ మహాదేవ్‌’ చేపట్టి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న ఐజీ (కశ్మీర్‌ రేంజ్‌) వీకే బిర్దీ, సీనియర్‌ ఎస్పీ (శ్రీనగర్‌) జీవీ సందీప్‌ చక్రవర్తితోపాటు జమ్మూకశ్మీర్‌కు చెందిన 19 మంది పోలీసులు హోంశాఖ అవార్డుకు ఎంపికయ్యారు. ఓ డీఐజీ సహా పలువురు ఎస్పీ స్థాయి నుంచి కానిస్టేబుళ్ల వరకు ఈ అవార్డు ఎంపికైన వారిలో ఉన్నారు. 21 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది కూడా ఈ మెడల్‌ను తీసుకోనున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి..

తెలంగాణకు చెందిన ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు (లక్ష్మణరావు, జాకబ్‌), ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు (చంద్రబాబు, ఉపేందర్‌ రావు, తిరుపతి) ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. ఏపీకి చెందిన ఎస్పీ (అద్నాన్‌ నయీం అస్మీ), అదనపు ఎస్పీ (భీమా రావు), డీఎస్పీ (ఆర్‌జీ జయసూర్య), ఎస్‌ఐ (ఎండీ నసీరుల్లా)తోపాటు ఫోరెన్సిక్‌ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫణి భూషణ్‌) ఈ అవార్డుకు ఎంపికైనట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ వెల్లడించింది.

హోంశాఖ పరిధిలో గతంలో ఉన్న వివిధ ప్రతిభా పురస్కారాలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చిన కేంద్ర ప్రభుత్వం.. ‘కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్‌’ను 2024లో ప్రవేశపెట్టింది. భారత తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ జయంతి రోజైన ‘ఏక్తా దివస్‌’ సందర్భంగా ఏటా అక్టోబర్‌ 31న వీటిని ప్రకటిస్తారు. 2025 ఏడాదికి గాను దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్లు, దర్యాప్తు, ఇంటెలిజెన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌ తదితర విభాగాల్లో ప్రతిభ కనబరిచిన మొత్తం 1466 మంది పోలీసు, భద్రతా సిబ్బందిని ఈ మెడల్‌కు ఎంపిక చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని