Indian Railways: 1000 అమృత్‌ భారత్‌ రైళ్ల తయారీ..: రైల్వే మంత్రి

దాదాపు 1000 ‘అమృత్‌ భారత్‌’ రైళ్లను తయారుచేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు.

Published : 02 Mar 2024 17:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రానున్న కొన్నేళ్లలో భారతీయ రైల్వే దాదాపు 1000 అధునాతన ‘అమృత్‌ భారత్‌ రైళ్ల (Amrit Bharat Trains)’ను తయారుచేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ వెల్లడించారు. అలాగే గంటకు గరిష్ఠంగా 250 కి.మీ. వేగంతో నడిచే రైళ్లను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నట్లు తెలిపారు. ‘పీటీఐ’ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఈ వివరాలు చెప్పారు. పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతా-హావ్‌డా నగరాలను కలుపుతూ.. దేశంలోనే తొలిసారి నదీగర్భంలో నిర్మించిన మెట్రో మార్గాన్ని ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 6న ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

అమృత్‌ భారత్‌ రైళ్లు.. విశేషాలివే

‘‘భారతీయ రైల్వే ఏటా 700 కోట్ల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చుతోంది. ప్రయాణాల విషయంలో ఒకరికి రూ.100 ఖర్చవుతుండగా.. రూ.45 మాత్రమే వసూలు చేస్తున్నాం. అమృత్‌ భారత్‌ రైళ్లు.. కేవలం రూ.454 ఖర్చుతో 1,000 కి.మీ. ప్రయాణాన్ని అందిస్తాయి’’ అని రైల్వే మంత్రి తెలిపారు. వచ్చే ఐదేళ్లలో ‘వందే భారత్‌’ రైళ్ల ఎగుమతి ప్రారంభమవుతుందన్నారు. ‘‘యువతలో ‘వందే భారత్‌’ బాగా ప్రాచుర్యం పొందింది. ప్రతీవారం ఓ రైలు పట్టాలెక్కుతోంది. రాబోయే కొన్నేళ్లలో 400 నుంచి 500 వరకు ఈ రైళ్లను తయారుచేస్తాం’’ అని వెల్లడించారు.

నదీగర్భంలో మెట్రో మార్గమిది..

కోల్‌కతా ‘ఈస్ట్‌-వెస్ట్‌ మెట్రో కారిడార్‌ (మెట్రో లైన్‌-2)’లో భాగంగా హుగ్లీ నదికి తూర్పు తీరంలో మహాకరణ్‌, పశ్చిమతీరంలో హావ్‌డా మెట్రోస్టేషన్‌లు నిర్మించారు. ఈ రెండింటిని కలుపుతూ నదీ మట్టానికి 32 మీటర్ల లోతులో, 520 మీటర్ల పొడవునా మెట్రో మార్గాన్ని నిర్మించారు. ఈ మార్గం ప్రారంభంతో కోల్‌కతాలోని టెగోరియా స్టేషన్‌ నుంచి హుగ్లీ నదికి అవతలి హావ్‌డా మైదాన్‌ వరకు మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయి. భూఉపరితలానికి 33 మీటర్ల దిగువనున్న హావ్‌డా మెట్రో స్టేషన్‌.. దేశంలోనే అతిలోతైన భూగర్భ మెట్రో స్టేషన్‌గా గుర్తింపు పొందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని